పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలను చంద్రబాబునాయుడు రాజమండ్రితో మొదలుపెట్టారు. పోలింగ్ అయిన దగ్గర నుండి ఓటింగ్ సరళిపై చంద్రబాబుది ఒకదారైతే తమ్ముళ్ళందరిది మరో దారి అన్న విషయం తెలిసిందే. సరే ఎవరి దారి వాళ్ళదే అయినా టిడిపికి ఓటమి ఖాయమన్న విషయమైతే తెలిసిపోతోంది.

 

అందుకే చంద్రబాబు తమ్ముళ్ళతో రెండోసారి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా భేటీలు మొదలుపెట్టారు. మొదట సమీక్ష నిర్వహించిన రాజమండ్రిలోనే తమ్ముళ్ళ ఒక విధంగా చంద్రబాబుకు షాకిచ్చారనే చెప్పాలి.

 

రాజమండ్రి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఓటమి దాదాపు ఖాయమనే అనిపిస్తోంది. తన గెలుపుకు సహకరించాల్సిన మేయర్ షర్మిలా రెడ్డి, ఆమె భర్తతో పాటు మాజీ ఎంఎల్ఏ బొడ్డు భాస్కరరామారావు వైసిపి విజయానికి పనిచేసినట్లు స్వయంగా చౌదరే ఆరోపించారు.

 

అలాగే కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్ధి వంగలపూడి అనిత గెలుపు కష్టమే అంటూ పార్టీ నేతలు చెప్పారు. పార్టీలోని కీలక నేతలే అనితకు వ్యతిరేకంగా పనిచేశారంటూ మరి కొందరు నేతలు ఫిర్యాదులు చేశారు. పార్టీ నేతలు అనితకు వ్యతిరేకంగా పనిచేసిన విషయం తన దృష్టికి కూడా వచ్చిందని స్వయంగా చంద్రబాబే ఒప్పుకోవటం గమనార్హం.

 

అదే సమయంలో రాజమండ్రి ఎంపి అభ్యర్ధి మాగంటి రూప మాట్లాడుతు జనసేన ప్రభావాన్ని తక్కువ అంచనా వేసినట్లు ఒప్పుకున్నారు. తాము అంచనా వేసిన దానికన్నా ఎక్కువగానే జనసేనకు ఓట్లు పడ్డాయని నివేదికలో అంగీకరించారు. అంటే రూప గెలుపు కష్టమని ఆమె మాటల్లోనే స్పష్టమైపోతోంది.

 

ఎంతెంత మెజారిటీలతో అభ్యర్ధులు గెలుస్తారో అంచనా వేసుకుందామని చంద్రబాబు సమీక్షలు పెడితే గెలుపుకు ఎక్కడెక్కడ బొక్కలు పడ్డాయో స్వయంగా అభ్యర్ధులే చెప్పటం, ఫిర్యాదులు చేసుకోవటం గమనార్హం. దాంతో ఫిర్యాదులు వినటానికి తాను సమీక్షలు పెట్టలేదని ఆ విషయాన్ని ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చంద్రబాబు సమీక్ష ముగించారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: