సార్వ‌త్రిక ఎన్నికల నేప‌థ్యంలో దేశంలో ఐదో ద‌శ పోలింగ్ జ‌రుగుతోంది. ఈ ఎన్నిక‌ల్లో భాగంగా చాలా ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు నెల‌కొన్నాయి. జ‌మ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని రోహ్మూ పోలీంగ్ సెంట‌ర్‌పై ఉగ్ర‌వాదులు గ్ర‌నేడ్ దాడికి పాల్ప‌డ్డారు. గ్ర‌నేడ్ ను పోలింగ్ సెంట‌ర్‌లోకి విసిరారు ఉగ్ర‌వాదులు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని పోలీసులు వెల్ల‌డించారు. 


ఇక డ్యూటీలో భాగంగా అక్క‌డే ఉన్న భ‌ద్ర‌తా బ‌లగాలు ముష్క‌రుల కోసం గాలింపులు చేప‌ట్టారు. అయితే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఉగ్ర‌వాదులు ఎల‌క్ష‌న్ టైమ్‌లో పోలింగ్ సెంట‌ర్‌పై దాడికి పాల్ప‌డ‌టం ఇదే తొలిసారి. మ‌రోవైపు శాంతి భ‌ద్ర‌త‌ల దృష్టిలో ఉంచుకుని సున్నిత‌మైన అనంత్‌నాగ్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మూడు, నాలుగు, ఐదు ద‌శ‌ల్లో పోలింగ్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో ఎన్నిక‌ల సంద‌డి ముగియ‌నుంది. 


ఎల‌క్ష‌న్ టైమ్‌లో బిహార్‌లోని ఛాప్రా పోలింగ్‌ బూత్‌ నెంబర్‌ 131లో ఈవీఎంను ధ్వంసం చేసిన రంజిత్‌ పాసవాన్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు పశ్చిమ బెంగాల్‌లోని బారక్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలో బీజేపీ, తృణ‌మూల్ కాంగ్రెస్ వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకున్నాయి. 


త‌న‌పై టీఎంసీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు దాడికి పాల్ప‌డిన‌ట్లు బారక్‌పూర్ బీజేపీ అభ్య‌ర్థి అర్జున్‌ సింగ్ అన్నారు. అలాగే బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఓటు వేయ‌కుండా అడ్డుకున్నార‌ని ఆరోపించారు. అయితే ఈ విష‌యంలో ఆయ‌న ఎన్నిక‌ల అధికారుల‌కు సంప్రదించ‌డానికి వెళ్లారు. ఈ సంగ‌తి తెలుసుకున్న టీఎంసీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు దాడి చేసిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. 


పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వ‌చ్చిన ఓట‌ర్ల‌ను తీవ్ర భ‌య‌భ్రాంతుల‌కు గురిచేయ‌డానికే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని దీనిపై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు. గ‌త నాలుగు విడత‌ల్లో జ‌రిగిన ఎల‌క్ష‌న్స్‌లో బెంగాల్ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన నేప‌థ్యంలో ఈ సారి ప్ర‌త్యేక భద్ర‌త ఏర్పాట్లు చేశారు అధికారులు. కేంద్ర సాయుధ బ‌ల‌గాల‌తో ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: