పదేళ్ళ రాజకీయంలో నాలుగు పార్టీలు మారిన అవంతి శ్రీనివాసరావు తన రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాసరావు మాదిరిగా ఓటమెరుగని వీరుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇక ఎన్నికలకు రెండు నెలల ముందు టీడీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి అవంతి సంచలనం స్రుష్టించారు. ఆయన కోరుకున్న భీమునిపట్నం  సీటు  వైసీపీలో సంపాదించుకున్నారు. సర్వేలు బట్టి చూస్తే అవంతి విజయం ఖాయమని అంటున్నారు. దాంతో ఆయన పార్టీ ఫిరాయించినందుకు తొలి ఫలితం అలా దక్కనుంది. ఇక ఆయన రెండవ కోరిక మంత్రి పదవి. అది ఎంత దూరంలో ఉంది అన్న చర్చ ఇపుడు సాగుతోంది.


ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయి. అదే జరిగితే జగన్ సీఎం అవుతారు. ఆ విధంగా అవంతి రాజకీయ అంచనా కూడా కరెక్ట్ అవుతుంది. ఇక వైసీపీలో చేరినపుడు అవంతి భీమిలీ సీటుతో పాటు మంత్రి పదవిని కోరారని అప్పట్లో ప్రచారం సాగింది. రేపటి రోజున జగన్ అధికారంలోకి వస్తే అవంతికి మంత్రి పదవి ఇస్తారని ఇపుడు గట్టిగా వినిపిస్తోంది. జగన్ తొలివిడతలోనే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. ఆ జాబితాలోనే అవంతి పేరు కూడా ఉండొచ్చని అంటున్నారు.

అవంతికి కనుక మంత్రి పదవి వస్తే భీమిలీలో అనవాయితీ తప్పదని కూడా అంటున్నారు.  ఇక్కడ గెలిచిన తరువాత మంత్రిగా గంటా శ్రీనివాస‌రావు టీడీపీలో కీలకమైన శాఖలను నిర్వహించారు. ఇపుడు అవంతి కూడా మంత్రి ఐతే అదే సంప్రదాయం కొనసాగుతుందని అంటున్నారు. భీమిలీ ఎన్నికల్లో అవంతి గెలుపు వెనక ఆయన మంత్రి అవుతారన్న ఆలోచనతోనే జనం ఓటేశారని అంటున్నారు. మొత్తానికి ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెత అవంతి విషయంలో నిజమవుతుందా అంటున్నారు. వైసీపీలో ఎంతో మంది మొదటి నుంచి ఉన్నారు. మరి జగన్ అవంతి పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారు. దాంతో జగన్ అధికారంలోకి వస్తే అవంతి మంత్రి అయిపోయినట్లేనని ఆయన అనుచరులు ధీమాగా  ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: