ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కానీ విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బోలెడు పదవులు వారి కోసం వేచి ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే కరువు తీరిపోయేలా పదవులు అన్నీ ఒక్కసారిగా వరించి వచ్చేస్తున్నాయి. టీడీపీ, వైసీపీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా పదవుల పందేరంలో ద్వితీయ, త్రుతీయ శ్రేణి నాయకులకు ఈసారి పండుగే అవుతుందని అంటున్నారు. ఓ వైపు లోకల్ బాడీ ఎన్నికలు ఉంటే మరో వైపు నామినేటెడ్ పదవులు ఎదురు చూస్తాయి. మొత్తానికి పనిచేసే వారికి ఇక అధికారం తప్పకుండా దక్కుతుంది.


అటు టీడీపీలో ద్వితీయ, త్రుతీయ శ్రేణి నాయకులు పదవులను అనుభవించి అచ్చంగా పదిహేనేళ్ళు దాటుతోంది. పదేళ్ళు టీడీపీ ప్రతిపక్షంలో ఉండడం, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈ అయిదేళ్ళు జీవీఎంసీ ఎన్నికలు పెట్టకపొవడం నామినేటెడ్ పదవులు భర్తీ చేయకపోవడంతో తమ్ముళ్ళు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ దఫా టీడీపీ అధికారంలోకి వస్తే వెంటనే జీవీఎంసీ ఎన్నికలు పెడతారు. పోటీ చేయవచ్చు అని భావిస్తున్నారు. అదే విధంగా వైసీపీలోనూ టికెట్ రాని వారు, పదవులు దక్కని వారు జీవీఎంసీ మీదనే చూపు పెట్టారు. జీవీఎంసీ ఎన్నికలు జరిగితే వార్డు కార్పోరేటర్లు 84 వరకూ వస్తాయి. దాంతో చాలా మందికి అవకాశం లభిస్తుంది.


అదే విధంగా విశాఖ నగరాభివ్రుధ్ధి సంస్థ చైర్మన్, డైరెక్టర్లు ఇతర పదవులు కూడా భర్తీ అవుతాయి. అదే విధంగా అనేకమైన నామినేటెడ్ పదవులు  జిల్లాలో భర్తీ కాకుండా ఉండిపోయాయి. ఇక కార్పోరేషన్ చైర్మన్ పదవులు, డైరెక్టర్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ పదవులపైన కూడా గంపెడాశలు పెట్టుకున్న వారు రెండు పార్టీలోనూ ఉన్నారు. అదే విధంగా స్థానిక  సంస్థల ఎన్నికలు జరుగుతాయి. దాంతో మునిసిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా పదవులు వస్తాయి. మొత్తానికి చూసుకుంటే టీడీపీ, వైసీపీ ఎవరు అధికారంలోకి వచ్చినా లోకల్ బాడీస్ కి ఎన్నికలు పెట్టడం, ఆ వెంటనే పదవులను పంపిణీ చేయడం వంటివి తప్పనిసరి. దాంతో తమ పార్టీ అధికారంలోకి రావాలని, తద్వారా ఎక్కువ పదవులు పొందవచ్చునని రెండు పార్టీల నాయకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: