తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప‌య‌నం ఆస‌క్తిక‌రంగా మారుతోంది. సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల హక్కులంటూ నినాదాలిచ్చిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు... తెలంగాణ లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌, బీజేపీ రెండూ దేశానికి పట్టిన దరిద్రాలనీ, అందువల్ల ఆ రెండింటినీ ఓడించాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు వివిధ పార్టీల నేత‌ల‌ను క‌లిసేందుకు ఓ టూర్ వేశారు. తాజాగా మ‌రో టూర్ వేస్తున్నారు. అయితే, ఎక్కడా ఆయ‌న క‌నీసం మీడియాతో మాట్లాడ‌టం లేదు. ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం లేదు. 


కేరళ, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ ప‌య‌న‌మ‌య్యారు. అయితే, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ తర్వాత ఆయన ఇప్పటి వరకూ మరే రాజకీయ నేతనూ కలిసింది లేదు.. చర్చించిందీ లేదు. బుధవారం తమిళనాడులోని కన్యాకుమారిలో బస చేసిన ఆయన గురువారం రామేశ్వరంలోగల మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమాధిని ఆయన దర్శించారు. ఈనెల 13న చెన్నైలో డీఎమ్‌కే అధ్యక్షుడు స్టాలిన్‌తో సీఎం భేటీ అవుతారంటూ తొలుత ప్రకటన వెలువడింది. తీరా చూస్తే.. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌తో భేటీ కాలేమంటూ డీఎమ్‌కే వర్గాలు తేల్చిచెప్పాయి. 


ఇలా ఊహించ‌ని షాక్‌కు గురైన టీఆర్ఎస్ అధ్య‌క్షుడు త‌న టూర్ అస‌లు ఉద్దేశం మాత్రం వ్య‌క్తం చేయ‌డం లేదు. ఫ్రంట్‌పై చర్చల పేరిట ఆయన డీఎమ్‌కే అధ్యక్షుడు స్టాలిన్‌ను, కర్నాటక సీఎం కుమారస్వామిని, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని ప్రత్యేకంగా కలిశారు. ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం, ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భేటీల వరకూ అంతా బాగానే ఉన్నా... ఆ తర్వాతే రాజకీయంగా పలు పరిణామాలు సంభవించాయి. ఆయా నేత‌లంతా త‌మ అజెండాను ప్ర‌స్తావించారు. దీంతో ఫ్రంట్ గురించి చ‌ర్చ‌లు త‌ప్ప కేసీఆర్ ఎక్క‌డా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌డం లేద‌ని ప‌లువురు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: