చంద్రబాబు అలాంటి ఇలాంటి నాయకుడు కాదు. ఆయనది నలభయ్యేళ్ళ రాజకీయ జీవితం. ఒక్కో మెట్టు ఎక్కి ఈ స్థితికి చేరుకున్న చంద్రబాబు లో ఎన్ని ప్లస్స్లులు  ఉన్నాయో అన్ని మైనస్సులు కూడా ఉన్నాయి. బాబు కు ఉన్న ఆతి పెద్ద మైనస్ ఆయన ప్రతీ పనీ తానే దగ్గరుండి చూసుకుంటారు. తనలా ఎవరూ చేయరని ఆయనకు అదో రకం చాదస్తం. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీకి ఆయనే కర్త ఖర్మ క్రియ.


కార్యకర్తల పార్టీగా టీడీపీని తయారు చేశానని చెబుతున్న బాబు వారిని నాయకులుగా మాత్రం మార్చలేకపోయారు. పైగా టీడీపీలో ఏ టూ జెడ్ బాబు ఉండడమే ఇపుడు ఆ పార్టీకి పెద్ద శాపంగా ఉంది. బాబు కంటే జూనియర్లు ప్రధాని పీఠం వైపు చూస్తున్నారు. వారితో పోల్చుకుంటే బాబుకు పీఎం అయ్యే చాన్స్ అర్హత రెండూ ఉన్నాయి. అయితే బాబు ఏపీలో తన తరువాత నాయకున్ని ఇంతవరకూ తయారుచేసుకోలేకపోయారు. ఈ విషయంలో అన్న నందమూరి చాలా నయం. బాబుని, మరో అల్లుడు దగ్గుబాటిని రెడీగా ఉంచారు.


మరి చంద్రబాబుకు ఉన్న భయం ఏంటి అంటే ఎవరిని పక్కన పెట్టుకున్నా వెన్నుపోటు పొడుస్తారని. అందువల్ల ఎవరినీ ఎదగనీయకుండా చేశారు. ఇది బాబులోని అభద్రతాభావానికి సూచిక అంటారు. బాబు లాగానే ప్రాంతీయ పార్టీలను ఏలుతున్న మమతా బెనర్జీ  ఆ పార్టీకి సుప్రీం. అయినా ఆమె తన మేనల్లుడుకు బాధ్యతలు చాలా అప్పగించారు. పార్టీలో చివరి నిర్ణయాలు మాత్రమే ఆమె చూస్తారు. ఇక పొరుగున ఉన్న కేసీయార్ తన కుమారుడు కేటీయార్ కి మొత్తం బాధ్యతలు అప్పగించేశారు. ఫైనల్ డెసిషన్  మాత్రమే తన దగ్గర ఉంచుకున్నారు.


ఉత్తర ప్రదేశ్లో మాయావతి కూడా అంతే. ఆమె సైతం తన అన్న కుమారుడికి పార్టీ బాధ్యతలు మొత్తం అప్పగించేశారు. తాను కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తారు. అందువల్లనే వీరంతా సులువుగా రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అదే బాబు విషయానికి వస్తే నమ్మి పార్టీని అప్పగించడానికి ఎవరూ లేరు. ఆ మాటకు వస్తే బాబు కూడా ఎవరినీ అసలు నమ్మరు. తన సొంత కొడుకుని కూడా బాబు నమ్మరని అంటారు.


ఈ కారణం చేతనే బాబు ఢిల్లీలో కీలకమైన పదవి వచ్చినా కూడా తీసుకునేందుకు రెడీగా లేరన్న మాట వినిపిస్తోంది. ఈసారి ఏపీలో బాబుకు ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లు వచ్చి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉన్నా ఆయన ముఖ్యమంత్రి పదవి వదలరుట. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. బాబుకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని అంటున్నారు. కానీ అసలు కధ వేరు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.


బాబు ఢిల్లీ వెళ్ళి ప్రధానో, ఉప ప్రధాని వంటి కీలకమైన పదవి చేపడితే ఏపీలో లేకేష్  ని  సీఎం చేస్తే తొందరలోనే మొత్తం పార్టీ కొంప మునిగిపోతుందని బాబుకు బాగా తెలుసు. పార్టీలో బాబుని చూసుకునే లోకేష్ మాట అంతా వింటారు తప్ప బాబు లేకుండా లోకేష్ నాయకత్వాన్ని ఎవరూ ఒప్పరన్నది తెలిసిందే. ఇక బాబుకు తెలిసిన రాజకీయ పట్లు, విడుపులు లోకేష్ కి అసలు తెలియవు. ఇక వైసీపీ వంటి పార్టీ ప్రతిపక్షంలో ఉంటే లోకేష్ తొందరలోనే అధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించేస్తారు. అంటే బాబు ఢిల్లీకి వెళ్తే మొత్తం పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.


ఇలా చాలా రకాలుగా అధ్యయనం చేసిన మీదటనే బాబు ఢిల్లీ వద్దు ఏపీ ముద్దు అన్న నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. మరో అయిదేళ్ళ పాటు ఏపీలోనే ఉంటూ పాలించాలన్నది బాబు ఆలోచనట. ఆ తరువాత లోకేష్ రాజకీయం నేర్చుకుని దక్షత పెంచుకుంటే సరే సరి. లేకపోతే లేదు అన్నది బాబు గారి ఫిలాసఫీగా ఉందని చెబుతారు. మొత్తానికి బాబుకు అధికర వైభోగానికి పరిస్థితులు అనుకూలించినా తాను వేసుకున్న ముళ్ళ కంచె లాంటి రాజకీయమే ఇపుడు బ్రేకులు వేస్తుదనుకోవాలేమో. ఇక బాబు గారి ఫిలాసఫీ తీసుకున్నా మరో అయిదేళ్ళ పాటు మాత్రమే ఆయన క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతారని కూడా అంటున్నారు. చూడాలి మరి మే 23 ఫలితాలు ఏం చెబుతారో.



మరింత సమాచారం తెలుసుకోండి: