స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో పోటీచేసే ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. నల్లగొండ స్థానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్‌ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి జిల్లా అభ్యర్థిగా ఉదయమోహన్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. రాష్ట్ర నేతలు పంపిన అభ్యర్థుల జాబితాకు ఏఐసీసీ నుంచి ఆమోదం లభించింది. 


ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ఖరారుచేశారు. వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపురెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఫారాలను అందజేశారు. జిల్లాల నాయకులతో సమన్వయంతో పనిచేసి, ఎన్నికల్లో విజయం సాధించాలని వారికి సూచించారు. నాయకులను సమన్వయం చేసే బాధ్యతను మంత్రులకు అప్పగించారు.

అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా రావు ఎమ్మెల్సీ అభ్యర్థులు, మంత్రులు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ అభ్యర్థులు గెలువడానికి అవసరమైన మెజారిటీ స్పష్టంగా ఉన్నదని తెలిపారు. కాగా,మూడు ఎమ్మెల్సీస్థానాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు. పోలింగ్ అనివార్యమైతే మే 31న నిర్వహించనున్నారు. జూన్ 3న ఓట్లను లెక్కిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: