ఫోర్జ‌రీ, నిధుల దారి మ‌ళ్లింపు స‌హా ప‌లు అక్ర‌మాల విష‌యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విష‌యంలో సంచ‌ల‌న అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు రవిప్రకాశ్‌కు రెండు 160 సీఆర్పీసీ నోటీసులు, ఒక 41-ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేశారు. వాటికి స్పందించకుండా అజ్ఞాతంలో ఉండటంతో అతడి అరెస్టు కు పోలీసులు రంగం సిద్ధంచేశారు. మూడు ప్రత్యేక బృందాలు రవిప్రకాశ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 


ర‌విప్ర‌కాశ్ కోసం సైబరాబాద్ పోలీస్ బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఆయన కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న్ను ప‌ట్టుకునేందుకు టెక్నాల‌జీని సైతం వాడుకుంటున్నాయి. సాంకేతికపరంగా రవిప్రకాశ్ మొబైల్‌నంబర్లపై ఆరాతీయగా రవిప్రకాశ్ దాదాపు 25 నుంచి 30 సిమ్‌లను వాడినట్టు పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన గుర్తింపు ఆధారాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ నంబర్లన్నీ ఇతరుల పేరుమీద ఉన్నప్పటికీ వాటిని రవిప్రకాశే ఉపయోగించాడని పోలీసులు గుర్తించారు.


ర‌విప్ర‌కాశ్ ఉప‌యోగించే మొబైల్ నంబ‌ర్లు ఈ నెల పదిన బంజారాహిల్స్‌లో స్విచాఫ్ అయినట్లు చూపిస్తున్నాయి.  తన సిమ్‌కార్డులను తీసేసి ఇతరుల ఐడీపేరుతో ఇంటర్నెట్ ద్వారా వాట్సప్ కాల్స్ వాడుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలానంబర్లు స్విచాఫ్‌లో ఉండగా ప్రస్తుతం కొన్ని నంబర్లు ఇతరులు వాడుతున్నట్లు తెలిసింది. పోలీసులు వారిని కూడా ప్రశ్నించారని సమాచారం. ఈ నంబర్ల కాల్‌డాటాపై పోలీసులు దృషిపెట్టారు. దీనికోసం పోలీసులు ఆయా నెట్‌వర్క్ సంస్థలకు లేఖలు రాసి డాటాను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటి లెక్క తేలితే...త్వ‌ర‌లో కీల‌క ప‌రిణామం ఉంటుందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: