ఇపుడందరిలోను ఇదే భయం మొదలైంది. భయమంటే మరేమీ లేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలోనే లేండి. పోలింగ్ జరుగుతున్నంత కాలం కేంద్రంలో ఏ కూటమికి కూడా సంపూర్ణ అధికారం వచ్చే అవకాశం లేదని ప్రచారం జరిగింది. దాంతో కేంద్రంలో హంగ్ తప్పదనే  చాలామంది భావించారు. ఇక్కడే ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుందని అంచనా వేశారు.

 

సీన్ కట్ చేస్తే తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే ఎన్డీఏకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని అర్ధమవుతోంది. అంటే మళ్ళీ నరేంద్రమోడినే ప్రధానమంత్రి అనే విషయం దాదాపు ఖాయమైపోయినట్లే. మొన్నటి వరకూ కేంద్రంలో ఎన్డీఏ కానీ లేకపోతే యూపిఏ కానీ అధికారంలోకి రావాలంటే జగన్ లాంటి వాళ్ళ మద్దతు తప్పదనే అందరూ అనుకున్నారు. సరే కేంద్రంలో అధికారంలోకి ఎవరు వచ్చినా జగన్ మద్దతు కావాలంటే ముందు ప్రత్యేకహోదాతో ప్రకటన  చేయించుకోవాలని జగన్ అనుకున్నారు.

 

తీరా ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే తటస్తుల అవసరమే ఎన్డీఏకి రాదని అర్ధమైపోతోంది. కేంద్రంలో ఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తే తటస్తుల అవసరం అంతగా తగ్గిపోతుంది. అదే నిజమైతే జగన్ డిమాండ్ ఏమైపోవాలి ? ఏపికి ప్రత్యేకహోదా డిమాండ్ ఎప్పటికి సాకారమవ్వాలి ? కూటముల అవసరాన్ని అవకాశంగా తీసుకుని అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేకహోదా సాదిద్దామని జగన్ ప్లాన్ వేశారు. ఆ విషయాన్ని జగన్ ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే.

 

ప్రాంతీయ పార్టీల అవసరం లేదనుకుంటే ఇక జగన్ లాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం బిజెపి నేతలకు ఉండదు. కాబట్టి రేపు జగన్ సిఎం అయినా కేంద్రం లెక్క చేసే అవకాశం తక్కువే. దాంతో ఏపికి ప్రత్యేకహోదా సాధన అన్నది అందని ద్రాక్ష లాగే తయారవుతుంది.

 

అయితే ఇక్కడే ఓ చిన్న విషయం కూడా ఉంది లేండి. తనవసరం ఎటూ ఉండదని జగన్ కు కూడా తెలుసు కాబట్టి జాగ్రత్తగా పావులు కదిపి మోడితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. పొరుగు రాష్ట్రంలో కెసియార్ మద్దతు కూడగట్టుకుని మోడిని మెప్పించ గలిగితే ఏపికి ప్రత్యేకహోదా వచ్చే అవకాశం ఉంది. అయితే కెసియార్, జగన్ కన్నా మోడి నాలుగాకులు ఎక్కువే చదివారు. కాబట్టి మోడి వ్యవహారం అంత తేలిక అయితే కాదు. కాబట్టి సిఎం అయితే జగన్ జాగ్రత్తగా పావులు కదపాల్సుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: