ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊహించ‌ని షాక్‌లు త‌గులుతున్నాయి. ఢిల్లీ వేదిక‌గా చ‌క్రం తిప్పాల‌ని చంద్ర‌బాబు భావిస్తుండ‌గా...మిత్ర‌పక్షాలుగా చంద్ర‌బాబు పేర్కొంటున్న నేత‌లు ఆయ‌న షాక్ ఇస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఢిల్లీలో ఈవీఎంల అంశంపై చర్చించేందుకు విపక్షాలు సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, చంద్రబాబుకు కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఊహించని షాకిచ్చారు. ఎన్నికల సంఘం వద్ద చంద్రబాబు చేపట్టేబోయే నిరసన కార్యక్రమానికి కుమారస్వామి దూరంగా ఉన్నారు. 


చంద్రబాబు నేతృత్వంలో ఢిల్లీలో ఈవీఎంల అంశంపై చర్చించేందుకు విపక్షాలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ధోరణిపై విపక్ష నేతలు చర్చించనున్నారు. ఈ స‌మావేశానికే కుమార‌స్వామి డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ నేత‌లు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్, సీపీఎం నేత‌ సీతారాం ఏచూరి, డీఎంకే నేత‌ కనిమొళి, సీపీఐ నేత‌లు సురవరం సుధాకర్ రెడ్డి, డి.రాజా తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు బృందం ఈసీని కలవనుంది. కాగా, పొరుగు రాష్ట్ర సీఎంను ఈ స‌మావేశానికి ర‌ప్పించ‌లేక‌పోయిన చంద్ర‌బాబు తీరుపై రాజ‌కీయవేత్త‌లు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నాయి. 


కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేయడంతో విపక్షాలు డీలాపడ్డాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల వెల్లడితో హస్తినలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మ‌రోవైపు నేడు ఎన్డీయే మిత్రపక్షాల సమావేశాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఏర్పాటు చేశారు. పోలింగ్‌ తర్వాత పరిణామాలు, ఎగ్జిట్‌పోల్స్‌, ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: