ఫలితాల తర్వాత తెలుగుదేశంపార్టీలో చీలిక వస్తుందా ?  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబునాయుడు వ్యవహార శైలిపై చాలామంది నేతలు మండిపోతున్నారట. కాకపోతే ఆ మంటేదో రేపు రిజల్టు తర్వాత ఏ రూపంలో బయటపడుతుందో అన్న విషయంలోనే అందరిలోను టెన్షన్ మొదలైందని సమాచారం. ఇదే విషయాన్ని బిజెపి నేతలు చెబుతున్నారు.

 

జగన్మోహన్ రెడ్డి సిఎం అయితే తమ గతేమవుతుందో అన్న భయం చాలామంది టిడిపి నేతల్లో ఉంది.  జగన్ కు వ్యతిరేకంగా  మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు ఎవరైనా కానీండి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం చంద్రబాబు దన్ను చూసుకునే వాళ్ళంతా రెచ్చిపోయారనటంలో సందేహం లేదు. రేపు జగన్ గనుక సిఎం అయితే తమ పరిస్ధితేంటి ? అన్న విషయంలోనే బాగా టెన్షన్ పడుతున్నారట. జగన్ కు వ్యతిరేకంగా  రెచ్చిపోయిన వారిలో కేవలం చంద్రబాబు ఆదేశాలతోనే ఎగిరెగిరి పడ్డారు.

 

ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు గనుక నిజమైతే వైసిపి బంపర్ మెజారిటీతో గెలవటం ఖాయం. అంటే టిడిపి గెలిచే ఎంఎల్ఏ స్ధానాలు చాలా తక్కువనే అంచనా వేస్తున్నారు. ఏదో ఓ 50 లేకపోతే 60 స్ధానాలో గెలిస్తే పార్టీ భవిష్యత్  ఒక విధంగా ఉంటుంది. అలా కాకుండా 30కి పడిపోతే మాత్రం టిడిపిలో చీలిక ఖాయమనే ప్రచారం మొదలైపోయింది. బిజెపి ఎంఎల్సీ మాధవ్ కూడా అదే చెబుతున్నారు. ఫలితాల తర్వాత టిడిపిలో చీలక రావటం ఖాయమని జోస్యం చెబుతున్నారు.

 

రేపు గనుక టిడిపి ఘోరంగా ఓడిపోతే పార్టీ తరపున గెలిచే కొద్ది మంది ఎంఎల్ఏల్లో ఎంతమంది పార్టీలో నిలుస్తారో డౌటేనట. అవకాశం ఉంటే వీలైనంత మంది టిడిపి ఎంఎల్ఏలు వైసిపిలో చేరిపోతారని బిజెపి ఎంఎల్సీ మాధవ్ అనుమానం వ్యక్తం చేశారు.   ఎలాగూ పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు తెరలేపారు. అదే దారిలో రేపు టిడిపి ఎంఎల్ఏలు నడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

ఒకరు, ఇద్దరు వెళితే కష్టమనుకుంటే గంప గుత్తగా వెళ్ళి తమదే అసలైన టిడిపి అని మెజారిటీ ఎంఎల్ఏలు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అపుడు జగన్ ఎవరిచేతా రాజీనామాలు చేయించాల్సిన అవసరం కూడా ఉండదు. తెలంగాణాలో జరిగినట్లే ఏపిలో కూడా టిడిపి నిట్టనిలువుగా చీలిపోతుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి.  వైసిపిని చీల్చి చెండాడి జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చంద్రబాబు అనుకున్నారు. బహుశా ఇపుడదే ప్లాన్ చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందేమో ? అదే జరిగితే చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే. అంతా బాగానే ఉంది కానీ ఇటువంటి రాజకీయాలను జగన్ ప్రోత్సహిస్తారా అన్నదే చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: