పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం...ఇది చంద్రబాబునాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు అండ్ కో అనేక మార్లు బహిరంగంగా చేసిన శపథం. అయితే పులివెందులలో జగన్ ను ఓడించటం జరిగేపని కాదని చంద్రబాబు అండ్ కో కు బాగా తెలుసు. అందుకనే కనీసం మెజారిటీ అయినా తగ్గించాలన్న పట్టుదులతో టిడిపి నేతలు బాగా కష్టపడ్డారు. మెజారిటీ తగ్గించాలని ఒకవైపు టిడిపి, మెజారిటీలో రికార్డు సాధించాలని మరోవైపు వైసిపి కష్టపడిందన్న మాట.

 

పోయిన ఎన్నికల్లో కూడా జగన్ ను కట్టడి చేయటానికి టిడిపి నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీ తెచ్చుకున్న ఎంఎల్ఏగా జగన్ రికార్డు సృష్టించారు. పోయిన ఎన్నికల్లోనే మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసిన జగన్ కు 75, 243 ఓట్ల మెజారిటీ వచ్చింది. టిడిపి అభ్యర్ధి సతీష్ రెడ్డికి 49,333 ఓట్లొచ్చాయి.

 

పోయిన ఎన్నికల్లో ఓడించటం మాట దేవుడెరుగు కనీసం మెజారిటీ కూడా ఎక్కువ రానీయకుండా కట్టడ చేయలేకపోయారు. ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి టిడిపి ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. జిల్లాకు ప్రత్యేకించి పులివెందుల ప్రాంతానికి కృష్ణా జలాలను సరఫరా చేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కుప్పం కన్నా పులివెందులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబే ఎన్నోసార్లు చెప్పుకున్నారు.


ఒకటికి ఇద్దరు మంత్రులను ప్రత్యేకించి పులివెందుల ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. వైఎస్ కుటుంబానికి ప్రత్యర్ధిగా మారిన సతీష్ రెడ్డిని శాసనమండలి సభ్యుడిని చేశారు. మండలి వైఎస్ ఛైర్మన్ ను చేశారు. పార్టీ ఫిరాయించి టిడిపిలో చేరిన జగన్ కు బద్ద విరోధిగా మారిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అంటే జగన్ ను దెబ్బకొట్టాలని చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదనే చెప్పాలి.

 

మరి ఈ సారైనా చంద్రబాబు ప్లాన్ వర్కవుటవుతుందా ? రేపటి కౌంటింగ్ లో కానీ ఏ విషయం తేలదు. కాకపోతే పోలింగ్ తర్వాత అనేక సంస్ధలు సర్వేలు నిర్వహించాయి. అందులో ఏ సంస్ధ సర్వే చేసినా పులివెందులలో జగన్ కు తక్కువలో తక్కువ 90 వేల మెజారిటీ వస్తుందని తేల్చాయి. మరి జగన్ మెజారిటీ తగ్గించే విషయంలో టిడిపి విజయం సాధిస్తుందో లేకపోతే వైసిపినే ఆధిక్యత నిలుపుకుంటుందో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: