వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీల‌క‌మైన ప్ర‌క్రియ‌ను పూర్తిచేసింది. ఈనెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ మేర‌కు ఏక‌వాక్య తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహన్‌కు ఈ రోజే పార్టీ ఎమ్మెల్యేలు హైద‌రాబాద్ రాజ్‌భ‌వ‌న్‌లో అందించ‌నున్నారు. 


తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన వైసీసీ ఎమ్మెల్యేలు... వైసీపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎన్నుకుంటూ ఏకవాక్య‌ తీర్మానం చేశారు. వైసీపీఎల్పీ నేతగా వైఎస్ జగన్‌ పేరును ఆ పార్టీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా.. బుగ్గన, ధర్మాన, పార్థసారథి, ఆదిమూలపు సురేష్. ఏకవాక్య తీర్మానంతో ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఆ తీర్మానం కాపీతో తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బయల్దేరారు. తీర్మానం కాపీని గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు. అనంత‌రం ప‌రిపాల‌న సంబంధ‌మైన ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. 


కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భాప‌క్షం, పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం సంద‌ర్భంగా తాడేప‌ల్లిలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ శాసనసభాపక్ష సమావేశానికి ఎమ్మెల్యేలంతా తరలిరావ‌డం,  ఎమ్మెల్యేలతో పాటు అనుచరులు, పార్టీ కార్యకర్తలు కూడా రావడంతో తాడేపల్లిలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం దగ్గర ట్రాఫిక్ స్తంభించింది. సుమారు కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలను అక్కడే నిలిపి... ఒక్కొక్కరుగా క్యాంపు కార్యాలయంలోకి నడుచుకుంటూ వెళ్తారు వైసీపీ ఎమ్మెల్యేలు.  కరకట్ట నుండి వాహనాలు నిలిచిపోయాయి. కొద్ది సేప‌టి త‌ర్వాత ట్రాఫిక్ క్లియ‌ర్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: