కౌంటింగ్ ముందు రోజు వరకూ చంద్రబాబు గొంతు వినని, ఆయన ముఖం చూపని చానల్ లేదు. పోలింగ్ అయిపోయినా కూడా చంద్రబాబు ప్రతీ రోజూ మీడియా ముందు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.  ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, వీవీ ప్యాట్స్ మొత్తం లెక్కించాలని, ఈసీ పని తీరు బాలేదని, ఇలా ఎన్నో ప్రకటనలు, మరో వైపు  దేశవ్యాప్త  టూర్లు.. మరి ఇన్నీ చేసిన బాబబు ఇపుడు ఎక్కడ...


బాబు మీడియాకు ముఖం చాటేయడం ఆయన రాజకీయ జీవితంలో ఇదే తొలిసారి. అసలు ఎటువంటి పరిస్థితులనైనా ఫేస్ చేసే బాబు ఇపుడు ఎందుకు మీడియా ముందుకు రాలేపోతున్నారన్నది పెద్ద చర్చగా ఉంది. సరిగ్గా ఇప్పటికి ముప్పయ్యేళ్ళ క్రితం 1989 ఎన్నికల్లో దేశమంత తిరిగి నేషనల్ ఫ్రంట్ ని గెలిపించిన అన్న నందమూరి ఉమ్మడి ఏపీలో ఘోర పరాజయం పాలయ్యారు. అలా ఇలా కాదు, రెండు ఎంపీ సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి. దాంతో తలెత్తుకోలేక అన్న గారు మీడియాకు ముఖం చాటేశారు.



ఇక అప్పట్లో వెంటనే మీడియా ముందుకు  వచ్చినది చంద్రబాబే. తప్పులు జరిగాయి సరిదిద్దుకుంటాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటూ క్యాడర్ కి మోరల్ బూస్ట్ ఇచ్చిన ధీరుడిగా బాబు అప్పట్లో కనిపించారు. మరి అటువంటి బాబు ఇపుడు మీడియాకు దూరంగా వెళ్లడమేంటి. ఆయన్ని  మీడియా బేబీ అని అంటారు. మరి మీడియా లేకుండా మాట్లాడకుండా బాబుకు రోజులు ఎలా గడుస్తున్నాయి. ఫలితాలు వచ్చి ఇప్పటికి నాలుగు  రోజులైనా బాబు గారు ఉలుకూ పలుకూ లేదు.


నిజమే అలా చేసేశాయి ఎన్నికల రిజల్ట్స్ టీడీపీ చరిత్రలోనే ఘోరమైన పర్ఫార్మెన్స్ అని అనుకూల మీడియావే రాస్తోంది. ఇక ఇపుడు తాపీగా బాబు గారి పాలనలో తప్పులను ఒక్కోటి ఎత్తి చూపుతూ బ్యానర్ వార్తలనూ వండి వార్చేస్తోంది. కానీ ఏంటి లాభం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక బాబుకు 23 సీట్లు రావడం అంటే తలవంపులే. దానికంటే పెద్ద తలవంపు కొడుకు లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడం. దీంతో చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారైందని అంటున్నారు.


కొడుకు గెలిచినా ఆ ధైర్యంతో మీడియా ముందుకు  బాబు గారు వచ్చేవారు.  రేపటి రోజుకు తన కుమారుడు ఉన్నాడని చెప్పుకునేవారు. ఇపుడు టీడీపీకి బాబే దిక్కు. బాబుని చూసే  జనం వద్దనుకున్నారు. మళ్ళీ మెప్పించడానికి వయసు సరిపోదు. ఇదే బాధలో ఉన్న బాబు ఇపుడు మీడియాకు ముఖం చాటేసారని అంటున్నారు. అంటే బాబుకు సన్ స్ట్రోక్ అలా ఇలా తగల్లేదన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: