ఈనెల 30వ తేదీన బీజేపీ ర‌థ‌సార‌థి న‌రేంద్ర‌మోదీ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్ష ఎంపీలందరూ తమ కూటమి నేతగా నరేంద్రమోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ పేరును బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదించగా, పార్టీ మాజీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్‌గడ్కరీ బలపరిచారు. ముఖ్య భాగస్వామ్యపక్ష నేతలైన జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్‌లు తమ పార్టీల మద్దతును తెలియజేశారు. 


అయితే, ఈ స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేబినెట్ ఏర్పాటు పై రకరకాల కథనాలు వస్తుంటాయని, ఎంపీలను గందరగోళానికి గురిచేసేలా ఉంటాయని మోడీ అన్నా రు. ‘‘ఇప్పుడు అందరిలో జరిగే చర్చ కేంద్ర కేబినెట్ ఏర్పాటుపైనే. మీకు పీఎంవో పేరిట ఎవరైనా ఫోన్ చేసి.. మీ పేరు మంత్రుల లిస్టులో ఉందని చెప్పొచ్చు. రాష్ట్రపతికి ఇచ్చిన లిస్టులో కూడా ఉందని నమ్మించొచ్చు. మీడియాలో వార్తల మీద వార్తలు రావొచ్చు. అది మనను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తుంది . మీకు మంత్రి పదవి వచ్చినట్లు సాక్షాత్తు పీఎంవో నుంచి ఫోన్ వచ్చినా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి” అని ఎంపీలకు సూచించారు. ప్రధాని, మంత్రి పదవులు ముఖ్యంకాదని, ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ముఖ్యమని అన్నా రు. ‘‘నేను మీలో ఒక్కడిని. మీతో పాటు ఎంపీని. మీతోపాటు కార్యకర్తను . నాకు, మీకు ఎలాంటి తేడా లేదు. అందరం కలిసి పనిచేద్దాం ” అని సూచించారు.


ఎన్డీఏ కూటమి రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టడానికి సర్వం సిద్ధమైన నేపథ్యంలో.. నవభారత నిర్మాణం దిశగా తమ ప్రభుత్వం సరికొత్త ఉత్సాహంతో నూతన ప్రయాణం ప్రారంభిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. కులాలు, విశ్వాసాలకు అతీతంగా పనిచేయాలని, ఎలాంటి వివక్ష చూపకూడదని కొత్తగా ఎన్నికైన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) పక్ష ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. మైనార్టీల విశ్వాసం చూరగొనాలని సూచించారు. 1857 స్వాతంత్య్ర పోరాటాన్ని ఉటంకిస్తూ.. స్వపరిపాలన కోసం నాడు అన్ని వర్గాల ప్రజలు చేతులు కలిపారని, 2020 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తికానున్న నేపథ్యంలో సుపరిపాలన కోసం నేడు అలాంటి ఉద్యమ స్ఫూర్తే అవసరం అని ప్రధాని చెప్పారు. రాజ్యాంగమే మనకు సుప్రీం. ఇంట్లో మనం ఎలాంటి రకమైన పూజా పద్ధతిని అనుసరించినా.. ఇంటి వెలుపల మాత్రం భారత మాతకు మించిన దైవం వేరే ఉండదు అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: