ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలో వాట్సాప్ చిచ్చుపెట్టారు. ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తాన‌ని ఎమ్మెల్యే ప్ర‌క‌టించారు. కొంతకాలంగా అధిష్టానంతో విబేధిస్తూ వస్తున్న చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబను పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడం వివాదాస్పదమైంది. ఐదేళ్ల టర్మ్ పూర్తైన వెంటనే ఆమ్ఆద్మీ పార్టీకి గుడ్ బై చెబుతానని స్పష్టం చేశారు. అయితే, 2020లో రాజీనామా చేసేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది


వివ‌రాల్లోకి వెళితే... లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఓటమికి గల కారణాల్ని చర్చించేందుకు పార్టీ కన్వీనర్, ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం సమావేశం నిర్వహించారు. ఓటమికి పార్టీ మొత్తానిదీ బాధ్యతన్న కేజ్రీవాల్ మాటల్నిఅల్కా తిరస్కరించారు. అన్ని నిర్ణయాలు తీసుకున్నవారే(కేజ్రీవాలే) ఓటమికి బాధ్యత వహించాలని సూచించారు. ఢిల్లీలో తన నియోజకవర్గం చాందినీ చౌక్‌లో ఆప్‌కు ప్రజలనుంచి మద్దతు లభించిందని...అలాంటప్పుడు ఓటమికి తానెందుకు బాధ్యత వహించాలని ఆమె ప్రశ్నించారు. అల్కా తీరును గర్హించిన పార్టీ.. ఆప్ ఎమ్మెల్యేల అధికారిక వాట్సాప్ గ్రూప్ లోంచి ఆమెను తొలగించింది. ఈ విషయాల్ని వెల్లడిస్తూ, పార్టీ తనను వెళ్లగొట్టాలని చూసినా, ఎమ్మెల్యే  టర్మ్ ముగిసేంత వరకూ అందులోనే కొనసాగుతానని చెప్పారు . పార్టీ పెద్దలపై ధిక్కార స్వరం వినిపిస్తున్న అల్కాను..ఆప్ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడం ఇది రెండోసారి.


గతేడాది డిసెంబర్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి భారతరత్నను రద్దు చేయాలన్న ఆప్ తీర్మానాన్నిఅల్కా వ్యతిరేకించినందుకు ఆమెను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీకోసం ప్రచారం చేస్తా రనే ఉద్దేశంతో మళ్లీ యాడ్ చేశారు. కానీ కేజ్రీవాల్ రోడ్ షోలో పాల్గొనేందుకు అల్కా  నిరాకరించారు. తనకు తానుగా పార్టీని వీడేలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని  అల్కా ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: