బంప‌ర్ మెజార్టీతో రెండో ద‌ఫా ప్ర‌ధాన‌మంత్రి ప‌గ్గాలు చేప‌ట్టిన నరేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర రీతిలో త‌న ప‌రిపాల‌న‌ను మొద‌లుపెట్టారు. కేబినేట్‌ మొదటి సమావేశంలో రైతులకు, వ్యాపారులకు మేలు చేసే నిర్ణ‌యం తీసుకున్నారు. పీఎమ్‌ కిసాన్‌ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా అందరు రైతులకు వర్తింపజేస్తూ కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులందరికీ.. మూడు దఫాలుగా 6000 రూపాయలు వాళ్ల అకౌంట్‌లో పడనున్నాయి. దీంతో 15 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వ్యాపారుల కోసం పెన్షన్‌ స్కీమ్‌ను కూడా కేబినేట్‌ క్లియర్‌ చేసింది. పెన్షన్‌ స్కీమ్‌ వల్ల మూడు కోట్ల మంది రిటైల్‌ ట్రేడర్లు, షాప్‌ కీపర్స్‌కు మేలు జరగనుంది.


ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మాన‌స పుత్రిక అయిన పీఎం కిసాన్‌ స్కీమ్ 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం కింద ప్రభుత్వం 75000 కోట్ల రూపాయలను కేటాయించింది. ముందుగా 12 కోట్ల చిన్న, సన్నకారు రైతులకు మాత్రం 6 వేల రూపాయలను మూడు దఫాలుగా చెల్లించేటట్టుగా స్కీమ్‌ను రూపొందించారు. రెండు హెక్టార్ల లోపు వ్యవసాయ భూమి ఉన్నవాళ్లే ఆ పథకం కింద అర్హులు అయ్యేవారు. కానీ.. ఇప్పుడు పేద రైతులకే కాకుండా.. అందరు రైతులకు ఈ స్కీమ్‌ వర్తించేలా కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్నారు. త‌ద్వారా మెజార్టీ రైతుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.


మ‌రోవైపు, కొత్తగా సెంట్రల్‌ సెక్టర్‌ స్కీమ్‌ ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ పెన్షన్‌ యోజన స్కీమ్‌ను కేబినేట్‌ ఆమోదించింది. చిన్న, సన్నకారు రైతులు స్వచ్ఛందంగా పెన్షన్‌ కోసం కొంత డబ్బును ఈ స్కీమ్‌లో కట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులు ఎంత డబ్బులు కడతారో.. అంతే డబ్బును వాళ్ల పెన్షన్‌ పండ్‌ కోసం కడుతుంది.. అని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కేబినేట్‌ మీటింగ్‌లో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: