అవును జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత అందరిలోను ఇదే అనుమానం మొదలైంది. మామూలుగా ఎవరిని మంత్రులుగా తీసుకోవాలన్నది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమే అన్న విషయం తెలిసిందే.  కానీ జగన్ మాత్రం మంత్రుల ఎంపిక విషయాన్ని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో మాట్లాడిన తర్వాతే ఫైనల్ చేస్తానని చెబుతున్నారు.

 

జగన్ చెప్పిన ఈ విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఉన్న మంత్రుల సంఖ్యేమో చాలా తక్కువ. గెలిచిన ఎంఎల్ఏల సంఖ్యేమో చాలా ఎక్కువ. దాంతో మంత్రివర్గం కూర్పు   జగన్ కు పెద్ద సవాలుగా మారింది. అందుకనే ఆయా జిల్లాల నుండి ఎవరిని మంత్రులుగా తీసుకోవాలన్న విషయాన్ని బహుశా ఎంఎల్ఏలు, ఎంఎల్సీలకే వదిలేస్తారా ? లేకపోతే మంత్రులుగా ఎవరిని తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు తీసుకుంటారా ? అన్నదే సస్పెన్సుగా మారింది.

 

మామూలుగా అయితే క్యాబినెట్ లో చోటు కల్పించలేని సీనియర్లతో సిఎంలు ముందుగా మాట్లాడేవారు. అందుకు ప్రత్యామ్నాయంగా సీనియర్ నేతలకు ఏవో హామీలిచ్చేవారు. కానీ ఇపుడు జగన్ రివర్సులో వ్యవహారం నడుపుతారేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి.

 

క్యాబినెట్ లోకి 25 మందికన్నా తీసుకునేందుకు లేదు. ఇప్పటికే మర్రి రాజశేఖర్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు క్యాబినెట్లో చోటు ఖాయమైపోయింది. అంటే మిగిలింది 21 బెర్తులు మాత్రమే. మొత్తం 25 స్ధానాలను ఏ ముఖ్యమంత్రి కూడా ఒకేసారి భర్తీ చేయరు. మంత్రివర్గంలోకి ఓ 20 మందిని తీసుకుంటారని అనుకుంటే 16 మందికే అవకాశం.

 

గెలిచిన వాళ్ళలో జగన్ కు అత్యంత సన్నిహితులే ఎక్కువ. పార్టీ తరపున గెలిచిన వాళ్ళల్లో 67 మంది కొత్తవారే.  మిగిలిన 84 మందిలోనే సీనియర్లు, బాగా సీనియర్లున్నారు. వీళ్ళల్లో నుండి 20 మందిని తీసుకోవటమంటే ఎవరికైనా కష్టమే. అందుకనే అభిప్రాయ సేకరణ మొదలుపెడతారని అనుకుంటున్నారు. చూడాలి శాసనసభా పక్ష సమావేశంలో ఏం చేస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: