పార్టీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం అలాగే అనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబునాయుడు మళ్ళీ బిజెపికి దగ్గరయ్యేందుకు యూటర్న్ తీసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం తెలిసిందే. అదే అదునుగా ఓ టిడిపి ఎంపి తొందరలో బిజెపిలోకి దూకేసేందుకు రెడీ అయిపోయినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

 

మళ్ళీ బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు పార్టీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపిల్లో విజయవాడలో గెలిచిన కేశినేని నానిని ఉపయోగించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాన్ని అవకాశంగా తీసుకున్న నాని చంద్రబాబు సంగతి ఎలాగున్నా ముందు తాను బిజెపిలోకి వెళ్ళిపోయేందుకు రంగం రెడీ  చేసుకుంటన్నారట.

 

నాని టిడిపిలో నుండి బిజెపిలోకి వెళ్ళిపోతాడనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. దానికితోడు మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత సమీప భవిష్యత్తులో టిడిపి కోలుకోవటం కష్టమనే అభిప్రాయం అందరిలోను కనిపిస్తోంది. దానికి తోడు సహచర ఎంపిలు గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడుకు లోక్ సభలో పదవులు కట్టబెట్టిన చంద్రబాబు కేశినేనిని మాత్రం దూరంగా పెట్టారు.

 

రెండు రోజుల క్రితం మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విజయవాడలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. దానికి చంద్రబాబు అండ్ కో హాజరైనా కేశినేని మాత్రం హాజరుకాలేదు. పార్లమెంటు పదవుల విషయంలో తనను దూరంగా ఉంచటంతో  చంద్రబాబుపై కేశినేని మండుతున్నారట. అందుకనే ఇఫ్తార్ కు కూడా హాజరుకాలేదని సమాచారం.

 

పార్టీ పరంగా భవిష్యత్తు చూసినా ఆశాజనకంగా కనపించటం లేదు. వైసిపిలోకి ఎలాగూ వెళ్ళలేరు. కాబట్టి మిగిలిన ఆప్షన్ బిజెపి ఒకటే. అందుకే  బిజెపిలోకి వెళిపోతేనే మంచిదని కేశినేని నిర్ణయించుకున్నారట.  కాబట్టి తొందరలో చంద్రబాబుకు పెద్ద షాక్ తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: