స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ మొదలయ్యేనాటికి టిడిపి మొత్తం క్లీన్ అయిపోతుందా ? చూడబోతే క్షేత్రస్ధాయి పరిస్ధితులు అలాగే కనిపిస్తున్నాయి.  స్ధానిక సంస్ధల ఎన్నికలు బహుశా ఆగస్టులోనో లేకపోతే సెప్టెంబర్లోనో జరగవచ్చు.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను వైసిపి దాదాపు క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఆ పద్దతిలో కాకుండా రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో నిజంగానే క్లీన్ స్వీప్ చేసేయాలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారట.

 

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేయటం నిజంగా పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే  మొన్నటి ఎన్నికల్లో టిడిపి గెలిచిందే 23 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్ధానాలను. అంటే జిల్లాకు రెండు అసెంబ్లీ స్ధానాలను కూడా సగటున టిడిపి గెలవలేదు. ఎప్పుడైతే వైసిపి అఖండ విజయం సాధించిందో చంద్రబాబునాయుడు పాలనపై జనాల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఫలితాల్లో వెల్లడైంది.

 

దాంతో ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు టిడిపిలో కొనసాగే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. తెలుగుదేశంపార్టీలోనే ఉంటే భవిష్యత్తు ఉండదన్న నిర్ణయానికి దాదాపు చాలామంది నేతలు వచ్చేశారు. అందుకనే ప్రత్యామ్నాయంగా అవకాశం ఉంటే వైసిపిలోకి లేకపోతే బిజెపిలోకి వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

 

టిడిపి నుండి బయటకు వచ్చేయాలని అనుకుంటున్న నేతల్లో ఎక్కువమంది ముందు వైసిపిలోకే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణాతో పాటు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా ఇదే పరిస్ధితి కనబడుతోంది. టిడిపి నియోజకవర్గం, మండల స్ధాయిలో గట్టి పట్టున్న నేతలను వైసిపిలోకి చేర్చుకునే విషయంలో జగన్ కూడా సానుకూలంగా ఉన్నారట.

 

చేరికలకు జగన్ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే వలసలు మొదలవుతాయని పార్టీ నేతలు అంటున్నారు. అదే గనుక మొదలైతే రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేయటానికి నేతలను వెతుక్కోవాల్సిందే. చూడబోతే టిడిపికి తెలంగాణాలో ఎటువంటి పరిస్ధితి దాపురించిందో ఏపిలో కూడా అటువంటి పరిస్ధితే రావటానికి ఎక్కువ కాలం పట్టదేమో అని అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: