ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతిని రూపుమాపడానికి కంకణం కట్టుకున్నారు. చంద్రబాబు హాయంలో అన్ని శాఖలలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాజధాని భూముల కుంభకోణంలో క్విడ్‌ఫ్రోకో తరహాలో చంద్రబాబు, లోకేష్‌, టీడీపీ మంత్రులు, బినామీల పేరుతో కొనుగోలు చేసిన భూముల కుంభకోణంపై విచారణ జరిపించనున్నారు. ఇక అగ్రిగోల్డ్ స్కామ్‌లో చినబాబు లోకేష్ పాత్రపై కూడా ఆరా తీస్తున్నారని సమాచారం. మరోవైపు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా లోకేష్ హయాంలో జరిగిన అవినీతిపై కూడా జగన్ విచారణ జరిపించనున్నారని సమాచారం. 


తమ ‍హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే  చంద్రబాబు సీబీఐకి అనుమతిని రద్దు చేస్తూ ఏపీలో అడుగుపెట్టకుండా చేశారు. ఏపీ పోలీసులతో ఐటీ, ఈడీ అధికారులకు చుక్కలు చూపించారు. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ ఎంట్రీకి అనుమతి రద్దు చేస్తూ చంద్రబాబు ఇచ్చిన జనరల్‌ కన్సెంట్‌‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఏపీలో సీబీఐ, ఈడీ వంటి అధికారుల ఎంట్రీకి మార్గం సుగమమైంది. దీంతో చంద్రబాబు, లోకేష్‌ల గుండెల్లో గుబుల్ మొదలైంది. ఇక సీబీఐకి చినబాబు లోకేష్ ఈజీగా టార్గెట్ కానున్నారని సమాచారం. దీనికి కారణం ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ చేసిన అవినీతి, అక్రమాలే.


అధికారాన్ని అడ్డం పెట్టుకున్న లోకేష్  విశాఖ కేంద్రంగా ఐటీ కారిడార్ అంటూ తన బినామీ కంపెనీలకు యధేచ్ఛగా వేలాది ఎకరాలు కేటాయించారు.  ఐటీ డెవలప్‌మెంట్ పేరుతో దాదాపు 20 వేల కోట్ల కుంభకోణానికి తండ్రీ కొడుకులు పాల్పడినట్లు సమాచారం. విశాఖలో ఐటీ కారిడార్ అంటూ, లక్షల కోట్లు పెట్టుబడులు ఎంఓయూలు అంటూ అడ్రస్‌లేని కంపెనీలని సృష్టించి , సొంతమనుషులతోనే తప్పుడు ఎంఓయూలు చేయించి, బినామీ కంపెనీల పేరుతో భారీగా దోపిడీ జరిగింది.  స్థానిక ఉద్యోగాల బూచి చూపించి విదేశీ కంపెనీలకు ఒక్క విశాఖలోనే కాదు అమరావతితోపాటు  రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాలు కట్టబెట్టారు. ఇందులో లోకేష్ కీలక పాత్రధారి అని సమాచారం.


ఇక ఐటీ గ్రిడ్స్ పేరుతో డేటా దుర్వినియోగానికి పాల్పడిన అశోక్ నారా లోకేశ్ ‌కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ పోలీసులకు దొరక్కుండా అశోక్ ఇప్పటికీ టీడీపీ పెద్దల సహకారంతో ఏపీలో తలదాల్చుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో అశోక్‌ను అరెస్ట్ చేస్తే తమ బండారం బయటపడుతుందని భయపడిన లోకేష్ అతన్ని విదేశాలకు పంపించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఐటీ గ్రిడ్స్‌కేసుపై కూడా  సీఎం జగన్ సీబీఐ విచారణ జరిపిస్తే లోకేష్ కుట్ర బయటపడుతుందని పోలీస్ అధికారులు అంటున్నారు. 


 రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ భూముల కుంభకోణంలో మంత్రులు లోకేష్, గంటాల పాత్ర ఉన్నట్లు స్వయంగా ఆ పార్టీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. అమరావతి నుంచి వచ్చిన నాయకులే విశాఖ భూములను కబ్జా చేసినట్లు అయ్యన్నపాత్రుడు కుండబద్ధలు కొట్టారు. పరోక్షంగా లోకేష్ ప్రమేయం ఉన్నట్లుగా అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేశారు. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం గంటాకు, టీడీపీ ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్ ఇవ్వడం రాజకీయంగా పలు విమర్శలకు దారి తీసింది. సీఎం జగన్ కనుక విశాఖ భూకుంభకోణం కేసును తిరిగి సీబీఐకి అప్పగిస్తే చినబాబు చిక్కుల్లో పడడం ఖాయమని టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డుగా అంటున్నారు. 


లోకేష్ ఒక్క ఐటీ శాఖలోనే కాదు... పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా శాఖా పరంగా చేపట్టే పనులలో కోట్లాది రూపాయల అవినీతిని ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ కింద చేపట్టే పనుల్లో లోకేష్‌ బినామీలకు కోట్లాది రూపాయల పనులు కట్టబెట్టినట్లు సమాచారం. లోకేష్ హయాంలో కాంట్రాక్ట్ లు అప్పగించి ఇంకా పని మొదలుపెట్టని పనులు దాదాపు 3,640కోట్ల రూపాయల మేర ఉన్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ పనులు మొదలుబెట్టని పనులను ఆపేసి టెండర్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ పనులు ఆగిపోయాయి. ఇక  25శాతం లోపు పని జరిగినవి మరో 2 వేల కోట్ల రూపాయల పనులున్నాయి. వీటన్నిటింటికి బిల్లులు చెల్లించడం ఆపేసిన  కొత్త ప్రభుత్వం ఈ పనులన్నింటిని రద్దుచేసే ఆలోచనలో ఉంది. సో..లోకేష్ హయాంలో జరిగిన  ఈ కాంట్రాక్టుల కేటాయింపులన్నిట్లో అక్రమాలు జరిగాయనేది స్పష్టం అవుతోంది.


 లోకేష్ హయాంలో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన బినామీ కాంట్రాక్టుల విఫయంలో సీఎం జగన్ కనుక సీబీఐ విచారణకు ఆదేశిస్తే చినబాబుకు మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయం. వీటికి తోడు ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా చినబాబు లోకేష్ జారీ చేసిన రహస్య జీవోల‌పై కూడా జగన్ త్వరలో సీఎం జగన్ సమీక్ష జరుపనున్నారు. దీంతో  ఈ రెండు శాఖల్లో అవినీతికి పాల్పడిన చినబాబు బాగోతం మొత్తం బయటపడనుందని సమాచారం. మొత్తంగా ఏపీలో సీబీఐ ఎంట్రీతో పెదబాబు చంద్రబాబుతో పాటు, చినబాబు లోకేష్ కూడా చిక్కుల్లో పడడం ఖాయమని ఏపీ అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారం ఉంది కదా అని..అడ్డగోలుగా అవినీతికి పాల్పడితే..చివరకు ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబడకతప్పదని చంద్రబాబు, లోకేష్‌లకు త్వరలో అర్థమయ్యే రోజు రానుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: