ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు తొలిసారి నిరసన సెగ త‌గిలింది. తాజా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ల్లే జ‌గ‌న్ ఈ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి రావ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు హ‌యాంలో జ‌ర‌గ‌ని న్యాయం..మీ హ‌యాంలో అయినా చేయాల‌ని ఆందోళ‌న కారులు కోరారు. వివ‌రాల్లోకి వెళితే....ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ పలు కీలక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టారు. నిజానికి వ్యవసాయ శాఖపై సమీక్ష బుధవారం జరగాల్సి ఉండగా, రంజాన్‌ పర్వదినం సందర్భంగా రద్దు అయింది. రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులు, ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు నీటి లభ్యత, వివిధ ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీరు తదితర అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష చేశారు.


తాడేపల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌సాయం దాని అనుబంధ విభాగాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంలోనే 2018 డీఎస్సీ అభ్యర్థులు, ఏఎన్ఎంలు సీఎం క్యాంపు కార్యాల‌యం ముందు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. కొత్త ప్రభుత్వమయినా తమకు న్యాయం చేయాలని కోరారు. వీరి ఆందోళనను క్యాంపు ఆఫీసు అధికారులెవరూ పట్టించుకోలేదు. ఆందోళనకారులు క్యాంపు కార్యాలయం ప్రాంగణంలోకి చొచ్చుకురాకుండా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.


కాగా, నకిలీ విత్తనాల చలామణీపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దని స్పష్టం చేశారు. దీనిపై విత్తన చట్టం తేవాలని సూచించిన అధికారులు... మీరు చెప్పిన చర్యలపై అవసరమైతే అసెంబ్లీలో చర్చించి చట్టం తెద్దామని తెలిపారు సీఎం వైఎస్ జగన్. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలు వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రం చేసే ఆలోచన ఉందన్న ఆయన.. రాష్ట్రంలో వినియోగించే విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ  గ్రామా సచివాలయాల ద్వారా జరిగేల చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సేవలు అందించింది అంటే దానికో ప్రత్యేక బ్రాండ్ పడాలి.. రైతులకు ప్రభుత్వ  సేవలపై విశ్వసనీయత పెంచాలని నవ్యాంధ్ర సీఎం పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: