మంత్రివర్గం కూర్పుపై జరుగుతున్న ప్రచారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి నిజంగా హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యతను తగ్గించేశారు. ముఖ్యమంత్రిగా ఏ సామాజికవర్గం వాళ్ళుంటే అదే సామాజికవర్గానికి పెద్ద పీట వేయటం సహజం. చంద్రబాబునాయుడు కూడా ఇదే చేశారు.

 

కానీ జగన్ మాత్రం రెడ్ల ప్రాధాన్యతను తగ్గించేశారు. మొత్తం 25 మంది మంత్రుల్లో కేవలం నలుగురు రెడ్లకు మాత్రమే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రెడ్ల ప్రాబల్యం ప్రధానంగా రాయలసీమలో ఎక్కువ. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి కూడా రాయలసీమలో రెడ్లు వైసిపికే సంపూర్ణ మద్దతు పలికారు. సరే మొన్నటి ఎన్నికల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనే అక్కర్లేదు.

 

మొత్తం మీద పార్టీ తరపున గెలిచిన 151 మంది ఎంఎల్ఏల్లో సుమారు 70 మంది రెడ్లే ఉన్నారు. అలాగే రాయలసీమలోని 52 స్ధానాల్లో వైసిపిలో గెలిచిన రెడ్లే 31 మందున్నారు. నాలుగు జిల్లాల్లోను మెజారిటీ రెడ్లదే. రాయలసీమలోని నాలుగు జిల్లాలైన అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది.

 

అలాంటి పరిస్ధితిల్లో కూడా రెడ్లు కేవలం నాలుగురికి మాత్రమే అవకాశం ఇచ్చారంటే జగన్ పెద్ద సాహసం చేశారనే చెప్పాలి. రెడ్ల ప్రాబల్యాన్ని  మంత్రివర్గంలో చివరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కూడా తగ్గించలేకపోయారు. అలాంటిది రెడ్ల సంఖ్యను తగ్గించేసి బిసి, కాపు, ఎస్సీలకు పెద్ద పీటవేయటమంటే మామూలు విషయం కాదు.

 

చూడబోతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతోంది. బిసిలు, కాపులు వైసిపితో ఏనాడు  లేరు. అలాంటిది మొదటిసారి మొన్నటి ఎన్నికల్లో టిడిపిని కాదని బిసిలు, పవన్ కల్యాణ్ ను కూడా కాదని కాపులు వైసిపికి మద్దతు పలికారు. దాంతో ఈ రెండు సామాజికవర్గాలను శాస్వతంగా వైసిపితోనే అట్టిపెట్టుకునేందుకే జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. జగన్ ప్లాన్ వర్కవుటైతే భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలో కూడా వైసిపికి తిరుగే ఉండదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: