రాజకీయాలకు పవన్ కొత్త. ఆ విషయం ఆయన మాటల్లో పదే పదే ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. అదే అయన్ని రెండు సీట్లలో ఓడించింది. గెలిస్తే నా అంత వారు లేరు అన‌డం ఓడితే మాత్రం జనాల మీద నెట్టడం ముసలి రాజకీయ నేతల నుంచి కొత్తగా వచ్చిన వారికి కూడా అలవాటు అయిపోయింది.


జనాలు ఎపుడు కరెక్ట్ గానే తీర్పు ఇస్తారు. వారి వివేచనను తప్పు పట్టలేం.  అందుకే 70 ఏళ్ళుగా దేశంలో భిన్న జాతులు, మతాలు, ప్రాంతాల మధ్య ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది. ఇకపోతే పవన్ తన ఓటమిని జీర్ణించుకోలేక డబ్బు ప్రభావంపై విమర్శలు చేస్తున్నారు. తనను భీమవరంలో ఓడించడానికి 150 కోట్లు ఖర్చు చేశారని  తాజాగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంటే పవన్ ద్రుష్టిలో జనం డబ్బులకు అమ్ముడుపోయి ఓటు ఆయనకు వేయలేదు అనుకోవాలా.


ఆ విధంగా అయితే ఈ దేశంలో ఎపుడూ ఎన్నికల్లో డబ్బున్న వాళ్ళే గెలవాలి. పేదలు చట్టసభల ముఖం చూడకూడదు, జగన్ పార్టీ తరఫున గెలిచిన వారిలో ఎంతో మంది పేదలు కూడా ఉన్నారు. ఇక్కడ డబ్బు ఓటర్లు తీసుకుంటున్నారన్నది కొంతవరకూ వాస్తవమైనా వారు ఓటేసేముందు అది ఎక్కడా కొలమానం కాదు, తమ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా లేడా, తాము ఆయన్ని కలుసుకోగలమా, సమస్యలపైన ఆయనకు ఉన్న అవగాహ‌న ఎంత, ప్రజాసేవ విషయంలో ఉన్న నిబద్ధత ఏంటి ఇలాంటి విషయాలను జనం చూసి ఓటు వేస్తారు.


ఇది అనేక ప్రజా తీర్పులలో రుజువు అయింది. ఎన్నికల ముందు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా చంద్రబాబు ఫలితాల తరువాత కామ్  గానే ఉంటున్నారు. ప్రజా తీర్పుని అలా ఆయన గౌరవించారన్నది తెలుస్తోంది. మరి కొత్తగా వచ్చిన పవన్ పదే పదే ఓట్లు డబ్బులు అంటూ ఘాటు విమర్శలు చేయడం వల్ల ఆయనకు లాభం లేకపోగా మరింత నష్టం వస్తుంది. 


ఇప్పటికైనా పవన్ తన పార్టీది పేలవమైన ప్రదర్శన అని మనస్పూర్తిగా అంగీకరించి ఇకపై చేయాల్సిన రిపేర్లు  చేసుకుని జనంలోకి వస్తే ఆదరించే అవకాశాలు ఉంటాయి. ఇది ఆదీ కాదు, అంతం అంతకంటే కాదు. పవన్ పాలిటిక్స్ లో  స్పొర్టివ్ గా తీసుకుని అడుగులు వేస్తే కొత్త తరానికి మార్గదర్శకంగా  ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: