స్పీకర్ అంటే పక్షపాతరహితంగా రాజ్యాంగ విలువలు కాపాడేవారుగా ఉండాలి. ఏపీతో పాటు పలు రాష్ట్రాలలో స్పీకర్లు రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ అపహాస్యం పాలు అవుతున్నారు. ఏపీలో గడచిన అయిదేళ్ళ కాలంలో జరిగిన అనేక సంఘటనలు దీనికి అద్దం పడతాయి.


ఏపీలో చూసుకుంటే కొత్త స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అవుతున్నారు. అయితే ఆయన కూడా  టీడీపీ మనిషే. అయితే ఇపుడు కాదు, ఒకపుడు.  పదేళ్ళ క్రితం ఆయన చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన తమ్మినేని ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరి 2014లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.


తాజా ఎన్నికల్లో మాత్రం ఆయన గెలిచి మంత్రి పదవి ఆశించారు. అయితే జగన్ ఆయన్ని స్పీకర్ గా ఉండమండంతో ఆ పదవిని గౌరవంగా బాధ్యతగా భావించి స్వీకరిస్తానని తమ్మినేని చెప్పారు. చిత్రమేంటంటే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఇపుడు తమ్మినేని ఇద్దరూ కూడా టీడీపీలో సీనియర్ మంత్రులుగా పని చేశారు. ఇద్దరూ కూడా అన్నగారు, చంద్రబాబు ఇద్దరి వద్ద మంత్రులుగా ఉన్నారు. ఇపుడు వైసీపీ తరఫున గెలిచిన తమ్మినేని అధ్యక్ష స్థానంలో ఉంటే చంద్రబాబు సభలో ప్రతిపక్ష పాత్రలో  ఉండడం విశేషం. మరి ఎలా సభ సాగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: