కాపురం చేసే కళ కాలు తొక్కే రోజే బయటపడింది అనేది తెలుగులో పాపులర్ సామెత. రాబోయే ఐదేళ్ళలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో అనేందుకు సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే బయటపడింది. స్పీకర్ గా తమ్మినేని సీతారామ్ ఎన్నికై  కుర్చీలో కూర్చోగానే జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబునాయుడు మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది.

 

జగన్-చంద్రబాబు మధ్య మాటల యుద్ధం మొదలైన తర్వాత రెండు వైపుల ఉండే సభ్యులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు ? అందుకే జగన్ కు మద్దతుగా మంత్రులు, ఎంఎల్ఏలు చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడ్డారు. అదే సమయంలో చంద్రబాబుకు మద్దతుగా టిడిపి ఎంఎల్ఏలు ఎదురుదాడికి దిగారు. దాంతో సభలో మాటల తూటాలు బాగానే పేలాయి.

 

మొదటి సెషన్ నడిచేది ఐదు రోజులే అయినా భవిష్యత్ సమావేశాలకు ఈ సమావేశాలే పునాదిగా ఉపయోగపడతాయి. కానీ మొదటి సమావేశంలోనే జగన్-చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలటానికి కారణం ఫిరాయింపులే కావటం గమనార్హం. స్పీకర్ గా తమ్మినేని ఎంపిక విషయంతో మొదలైన మాటల యుద్ధం తర్వాత గాడి తప్పి ఫిరాయింపులే కేంద్రంగా చాలాసేపు మాటల తూటాలు పేలాయి.

 

నిజానికి స్పీకర్ గా ఎన్నికవ్వగానే ఎన్నికైన తమ్మినేనికి అభినందనలు తెలుపుతు మాత్రమే మాట్లాడాలి. కానీ రెండు వైపుల సభ్యులు ఒకవైపు తమ్మినేనికి అభినందనలు తెలుపుతునే మరోవైపు చంద్రబాబు హయాంలో జరిగిన ఫిరాయింపుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తునే ఉన్నారు.

 

స్పీకర్ ఎంపిక విషయంలో కానీ స్పీకర్ ను కుర్చీలో కూర్చోబెట్టే సమయంలో కానీ చంద్రబాబు అండ్ కో సంప్రదాయాలను పాటించలేదని వైసిపి సభ్యులు ఆరోపించారు. స్పీకర్ ఎంపిక విషయాన్ని తమకు మాట మాత్రంగా కూడా చెప్పలేదని చంద్రబాబు అండ్ కో ఎదురుదాడికి దిగారు. ఇదే వరసలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటునే ఉన్నారు. మొత్తం మీద  సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే భవిష్యత్తులో సమావేశాలు ఏ రీతిగా జరగబోతున్నాయో అనే విషయంలో స్పష్టమైన సంకేతాలనే ఇచ్చినట్లైంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: