ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కళా కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత జరుగునున్న మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల‌ సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, రక్షణ, హోం, ఆర్థికశాఖ మంత్రులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో వర్షపు నీటి సమర్థ వినియోగం… కరవు పరిస్థితిపై సమీక్షించనున్నారు.  వెనుకబడిన జిల్లాల అభివృద్ధి,  వ్యవసాయరంగంపై చర్చించనున్నారు.

 

ఏపీ నుంచి సీఎం జగన్, ఇతర అధికారులతో కలిసి సమావేశానికి హాజరయ్యారు. నీతి ఆయోగ్ వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మరోసారి ప్రస్తావించనున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు ఈ స‌మావేశంలో ప‌ది నిమిషాల స‌మ‌యం కేటాయించారు.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా నీతి అయోగ్‌ సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను, హోదా పొందడానికి ఆంధ్రప్రదేశ్‌కు గల అర్హతలను ఆయన వివరించనున్నారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు కనీస మద్దతు ధర, విద్య, వైద్య రంగాలకు కేంద్ర సాయం, పేదలకు ఇళ్ల నిర్మాణం వంటి కీలక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సంస్కరణలను తెలియజేస్తూ కేంద్ర సాయాన్ని కోరనున్నారు. పరిపాలనలో అన్ని స్థాయిల్లో పారదర్శకత పెంచడానికి, అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించనున్నారు. 

 

 

జ‌గ‌న్‌తో పాటుగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల సీఎంలు మొదటిసారి నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాబోతున్నారు. జ‌గ‌న్‌తో పాటుగా వివిధ రాష్ట్రాల సీఎంలు తమ డిమాండ్లను, సూచనలను ప్రధాని ముందు ఉంచనున్నారు. గ్రామీణ ప్రాంతాలల్లో మౌళిక సదుపాయాలు, రోడ్ల నిర్మాణం, తాగునీటీ సరఫరా తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.అయితే నీతి ఆయోగ్ ఎన్ని అంచాలు వేసినా, నివేదికలు సమర్పించినా…నీతి ఆయోగ్‌ కు ఎలాంటి ఆర్ధిక అధికారాలు లేకపోవడంతోనే..నీతి ఆయోగ వ్యవస్థను తాను వ్యతిరేకిస్తున్నట్టు బెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: