ఆదివాసీ కుటుంబాలను 24 గంటల్లో (16.6.2019 సాయంత్రంలోపు) తమ ఎదుట ప్రవేశ పెట్టాలని ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలోనే, ఆసిఫాబాద్‌ జిల్లా అటవీ శాఖ అధికారులు ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌కు ఆదివాసీలను తీసుకొచ్చారు. 

ఆదివారం సాయంత్రం 5 గంటలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ఎదుట వారిని హాజరుపరిచారు.ఆ సమయంలో, 16 కుటుంబాల నుంచి న్యాయమూర్తి వివరాలు సేకరించారు. అయితే, అటవీ అధికారులు తమను బలవంతంగానే టింబర్‌ డిపోకు తరలించారని ఆదివాసీలు చెప్పారు. తమను జంతువుల్లా చూశారని న్యాయమూర్తికి విన్నవించారు.

ప్రభుత్వం తరపు న్యాయవాది, వివరణ కూడా విన్న తరువాత , కుమ్రం భీం జిల్లా , కోమలగొండి గ్రామంలోని 16 ఆదివాసీ కుటుంబాలకు శాశ్వత పునరావాసం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బాధిత కుటుంబాలకు వ్యవసాయ భూములు కేటాయించాలని, ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్దేశించింది. అప్పటి వరకూ వారికి తాత్కాలిక పునరావాసం కల్పించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. 16 ఆదివాసీ కుటుంబాలకు చెందిన 67 మందిని అక్రమంగా తరలించి, అటవీ శాఖ డిపోలో నిర్భంధించారంటూ తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భూములు కేటాయించాల్సిందే..

 '' ఆరు నెలల్లో 91 ఎకరాలను 67 మంది ఆదివాసీలకు కేటాయించాలని, ఏడాదిలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారికి మేకలు, గేదెలు, కోళ్లు ఇప్పించడంతోపాటు విద్య, వైద్యం అందించాలని '' హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోమలగొండి గ్రామానికి వెళ్లకుండా.. ప్రభుత్వం ఇచ్చే భూముల్లో వ్యవసాయం చేసుకోవాలని ఆదివాసీలకు సూచించింది. బాధిత కుటుంబాలకు వ్యవసాయ భూములు, ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే.. పిటిషనర్లు కోర్టు ధిక్కారం కింద కేసు వేసేందుకు స్వేచ్ఛ ఇస్తూ వ్యాజ్యాన్ని మూసివేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: