తాజా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. విశాఖ అర్బన్ జిల్లాలో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా నాలుగంటే నాలుగు సీట్లను గెలుచుకుంది. దాంతో ఇప్పట్లో పార్టీని లేపడం కష్టమన్న భావనకు తలపండిన సీనియర్లు వచ్చేశారు. ఇక గంటా విషయానికి వస్తే అధికార వియోగాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు. దాంతో ఆయన పార్టీకి టచ్ మీ నాట్ అంటున్నారు. ఈ మధ్య జరిగిన పార్టీ సమీక్షా సమావెశానికి గంటా గైర్ హాజర్ కావడం పెద్ద చర్చగా ఉంది.


ఆయన రాజకీయ ప్రత్యర్ధి, సీనియర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రావడం వల్లనే గంటా రాలేదని మొదట్లో ప్రచారం జరిగినా ఇపుడు అది కాదని తేలిపోయింది. గంటా టీడీపీలో ఉండలేకపోతున్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని అంటున్నారు. అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండడం భారంగా భావిస్తున్న గంటా బీజేపీకి టచ్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది.  గంటాకు ఓ అలవాటు ఉంది. ఏ పార్టీలోకి జంప్ చేసినా ఒక్కరుగా వెళ్ళరు.



ఆయన వెనకాల మరికొందరిని కూడా తీసుకువెళ్తారు. ప్రజారాజ్యం నుంచి, కాంగ్రెస్, అటునుంచి టీడీపీలోకి మారినపుడు కనీసంగా అరడజన్ మంది ఎమ్మెల్యేలను గంటా వెంట తీసుకెళ్ళారు. ఇపుడు గంటా వెంట ఎంత మంది నడుస్తారు అన్నది కూడా చర్చగా ఉంది. విశాఖలో చూసుకుంటే గెలిచిన నలుగురులో ముగ్గురు గంటాకు సన్నిహితులే, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఒక్కరే  అయ్యన్నపాత్రుడు వర్గం ఎమ్మెల్యే.  ఆ విధంగా ఈ ముగ్గురితో పాటు, మిగిలిన జిల్లాల్లోనూ గంటాకు ఎమ్మెల్యేలతో పరిచయాలు ఉన్నాయి.


మరి ఎంతమందిని ఆయన తీసుకెళ్తారన్నది టీడీపీ పెద్ద‌ల‌నూ కలవరపెడుతోంది. గంటా మౌనంగా ఉండడం, ఎవరికీ అందుబాటులోకి రాకపోవడంతో ఆయన రాజకీయ వ్యూహం పసుపు పార్టీని తెగ కలవరపెడుతోంది. ఏది ఏమైనా గంటా కనుక ఫిరాయిస్తే ఆ దెబ్బ అలా ఇలా ఉండడని,  మొత్తం 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో కనీసం మూడవ వంతు ఎమ్మెల్యేలను ఆయన తనతో పాటుగానే తీసుకెళ్ళిపోతారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: