గ‌త కొద్దిరోజులుగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఎంఐఎం శాసనసభపక్ష నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం విష‌యంలో కీల‌క స‌మాచారాన్ని పార్టీ వెల్ల‌డించింది. తీవ్ర అస్వస్థతతో కొన్ని రోజులుగా లండన్‌లోని ఓ కార్పొరేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న  పూర్తిగా కోలుకున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపాయి. ఈ నెల 21న అక్బరుద్దీన్ హైదరాబాద్‌కు చేరుకుంటారని ఎంఐఎం పార్టీ నాయకులు చెప్పారు. 


2011 మే 4న అక్బరుద్దీన్‌పై చాంద్రాయణగుట్టలో హత్యాయత్నం జరిగింది. ఊరేగింపులో పాల్గొన్న ఒవైసీపై మహమ్మద్ పహిల్వాన్‌తోపాటు కొందరు కత్తులు, రివాల్వర్‌తో దాడికి పాల్పడ్డారు. పెద్దపేగుకు గాయం, కిడ్నీలో బుల్లెట్ ఉండిపోవడంతో తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు. లండన్‌లో చికిత్స పొంది, హైదరాబాద్ వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, పెద్దపేగు గాయం తరుచూ వేధిస్తుండటంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం లండన్‌లోని ఓ ఆస్ప‌త్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ప్రస్తుతం ఆయన కోలుకున్నారని.. హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీలో సీనియర్ నాయకుడొకరు వెల్లడించారు. 


ఇదిలాఉండ‌గా, ఇటీవ‌ల ఎంఐఎం పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో జరిగిన ఈద్-మిలాప్ కార్యక్రమంలో అసదుద్దీన్ మాట్లాడుతూ.. తన తమ్ముడు, ప్రజానాయకుడు అక్బరుద్దీన్ ఆరో గ్యం మళ్లీ క్షీణించిందని, చికిత్స కోసం లండన్‌లోని దవాఖానకు తరలించినట్టు ప్రకటించడం సంచలనం సృష్టించింది. అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం మెరుగుపడాలని, పెద్దపులిలా తిరిగి రావాలని అల్లాను ప్రార్థించాలని ప్రజలను కోరారు. తాజాగా అక్బర్ ఆరోగ్యం మెరుగుపడిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఐఎం వర్గాలు వెల్లడించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: