సౌదీ ఆరేబియా ప్రిన్స్ మొహ‌మ్మ‌ద్ బిన్ స‌ల్మాన్ ఊహించ‌ని చిక్కుల్లో ప‌డిపోతున్నారు. వాషింగ్ట‌న్ పోస్టు జ‌ర్న‌లిస్టు జ‌మాల్ ఖ‌షోగ్గీ హ‌త్య కేసులో.. సౌదీ ఆరేబియా ప్రిన్స్‌ను విచారించాల్సిందే అని ఐక్య‌రాజ్య‌స‌మితి అభిప్రాయ‌ప‌డింది. ఖ‌షోగ్గీ హ‌త్య కేసులో ప్రిన్స్ స‌ల్మాన్‌తో పాటు ఉన్న‌త స్థాయి అధికారుల ప్రమేయం ఉన్న‌ట్లు యూఎన్ నిపుణులు వెల్ల‌డించారు. అంద‌ర్నీ ఈ కేసులో ద‌ర్యాప్తు చేయాల‌న్నారు. ఖ‌షోగ్గీ హ‌త్య కేసులో ప్రిన్స్ స‌ల్మాన్‌పై కావాల్సినన్ని సాక్ష్యాలు ఉన్న‌ట్లు నిపుణులు చెప్పారు.


గత ఏడాది అక్టోబర్ రెండో తేదీన టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయంలో ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై తమకు సమాచారం లేదని తొలుత బుకాయించిన సౌదీ రాజ కుటుంబం.. అంతర్జాతీయ విమర్శల నేపథ్యంలో దౌత్య కార్యాలయంలో జరిగిన ఘర్షణలో బలయ్యాడంది.  ఈ నేప‌థ్యంలో ఐక్య‌రాజ్య స‌మితి రంగ ప్ర‌వేశం చేసింది. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు సంబంధం ఉన్నట్టు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి నిపుణురాలు ఆగ్నెస్ కాల్లామార్డ్ ఆరోపించారు. విదేశాల్లోని మహమ్మద్ బిన్ సల్మాన్ ఆస్తులను జప్తు చేయాలని పిలుపునిచ్చారు. చట్ట విరుద్ధ హత్యలు, శిక్షల అమలుపై ఐరాస నిపుణురాలు అయిన‌ ఆగ్నెస్ కాల్లామార్ట్.. ఖషోగ్గి హత్య కేసులో మహ్మద్ బిన్ సల్మాన్‌కు నేరుగా సంబంధం ఉందన్నారు. ఖషోగ్గి హత్యపై మరింత లోతుగా దర్యాప్తు జరుపాలని కాల్లామార్ట్ సూచించారు. దీనిపై సౌదీ, టర్కీ అధికారులు జరిపిన దర్యాప్తు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదన్నారు.


సౌదీ దౌత్య కార్యాలయంలో ఖషోగ్గి హత్యానేరం ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న 15 మందిలో 11 మంది అనుమానితులు సౌదీలో అసలు విచారణను ఎదుర్కోలేదని పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ అధికారులతోనూ చర్చించిన కాల్లామార్ట్.. ఈ కేసుపై అమెరికా కేంద్రంగా దర్యాప్తు చేపట్టడమే సరైందన్నారు. ఖ‌షోగ్గీ హ‌త్య‌పై ఆగ్నెస్ క‌ల్లామార్డ్ నివేదిక త‌యారు చేశారు. సాక్ష్యాలు ల‌భించిన దాన్ని బ‌ట్టి ఈ కేసులో మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు అవ‌స‌ర‌మ‌ని క‌ల్లామార్డ్ తెలిపారు. అంత‌ర్జాతీయ ప్యానెల్ నిస్ప‌క్ష‌పాతంగా విచార‌ణ చేప‌ట్టాల‌న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: