టీడీపీ పార్టీ నుంచి నలుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలోకి వెళ్లటంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరపడం మామూలే. కామెడీగా, చినబాబు నారా లోకేష్‌ కూడా పార్టీ పరిస్థితిపై ఆరా తీసేశారట. అదీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుని అడిగి ప్రస్తుతం పార్టీలో వాతావరణమేంటి.? అని కనుక్కున్నారట.. ధైర్యం కూడా చెప్పేశారట. 'మేం వచ్చేస్తున్నాం.. సమస్యలన్నీ సర్దుకుంటాయ్‌..' అని చినబాబు సెలవిచ్చారట.

ఎంతైనా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా.! చినబాబు ధైర్యం చెప్పే వుంటారు. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన నారా లోకేష్‌, పార్టీకి ధైర్యం చెప్పేంతటి సీన్‌ కలిగి వున్నారా.? అన్నది వేరే చర్చ. చంద్రబాబు తనయుడు గనుక, పార్టీలో అందరూ ఆయన మాట వినాలి గనుక.. పార్టీలో ఇంకా చంద్రబాబుకి వంగి వంగి దండాలెట్టేవారుంటే.. వారికి లోకేష్‌ ధైర్యం చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 


చంద్రబాబు, లోకేష్‌.. విదేశాల నుంచి తిరిగొచ్చేలోపు.. మరిన్ని అద్భుతాలు జరుగుతాయని బీజేపీ నేతలు అంటున్నారు. టీడీపీకి చెందిన రాజ్య సభ సభ్యుల్ని నలుగుర్ని లాగేసి, మొత్తంగా ఓ గ్రూప్‌ని బీజేపీలో కలిపేసుకున్నట్టే.. 2/3 వంతుల మంది ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి లాగేయడానికి పక్కా ప్రణాళిక రచించినట్లు బీజేపీ నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌గా కాదు.. బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: