కాళేశ్వరం ప్రాజెక్టు కోసం హరీష్ పడ్డ కష్టం అందరికీ తెలిసిందే. కానీ కేసీఆర్ మాత్రం హరీష్ ను కావాలనే పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.  తన కొడుకును మించి ప్రజాదరణ, సమర్థత ఉన్న మేనల్లుడు హరీష్ రావును ఆయన అవమానిస్తున్న తీరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోనూ తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది. మంత్రి పదవి ఇవ్వకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు అప్పగించకుండా హరీష్‌ను ఎంతగా అవమానించారో తెలిసిందే.


కార్యకర్తల్ని చాలా ఆవేదనకు గురిచేస్తున్న వ్యవహారమిది. హరీష్ ఎంతగా ఓపిక పడుతుంటే.. అంతగా అతడి సహనాన్ని పరీక్షిస్తున్నారు. అవమానాలకు గురి చేస్తున్నారు.తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు పోతూ అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ప్రాజెక్టు కోసం రేయింబవళ్లు కష్టపడి.. ఈ కల సాకారం కావడంలో కీలక పాత్ర పోషించిన హరీష్‌ను మాత్రం పక్కకు తోసేశారు. దీనిపై జనాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


అసలే బీజేపీ ఎప్పుడు హరీష్‌ను దువ్వుదామా.. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తోంది. జనాభిప్రాయం తెలుసుకోకుండా కొడుక్కి ఎక్కడ పోటీ అవుతాడో అని హరీష్‌ను ఎంతగా తొక్కాలో అంతగా తొక్కి ప్రత్యర్థులకు అవకాశమిస్తున్నారు. తన పట్ల జనాల్లోనూ ఆగ్రహం పెరిగేలా చేసుకుంటున్నాడు కేసీఆర్. సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కూడా టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందన్న విషయం మరువరాదు. ఇదే తీరును కొనసాగిస్తే జనాల్లో ఆగ్రహం పెరగడం, హరీష్‌ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ వైపు చూడటం.. టీఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికల నాటికి ప్రతికూల పవనాలు వీచి అధికారం కోల్పోవడం ఖాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి: