జగన్ ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించి గట్టిగా నెల రోజులు కూడా కాలేదు. జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తనదైన రాజనీతిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


మరో వైపు టీడీపీ కుదేలైపోయిఉంది. ఆ పార్టీ పూటకో సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ పార్టీ నుంచి నలుగురు ఎంపీలు ఒక్కసారిగా బీజేపీలోకి చేరిపోవడంతో ఎటూ దిక్కుతోచడంలేదు. ఇక వైసీపీ విషయానికి వస్తే జగన్ అధికారిక కార్యక్రమాల్లో  బిజీగా ఉన్నారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి వెళ్ళి వచ్చారు. సరిగ్గా ఇక్కడే తప్పు పట్టుకోవడానికి టీడీపీ తయారైపోయింది.


ఏపీకి తీరని అన్యాయం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి జగన్ ఎలా వెల్తారంటూ అపుడే టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ఇది పూర్తిగా దారుణం అంటూ విరుచుకుపడుతున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ బూర్లగడ్డ వేదవ్యాస్ దీని మీద జగన్ని నిలదీశారు. గతంలో జగన్ కర్నూలో జల దీక్ష పేరిట మూడు రోజులు చేసిన ఆందోళన అంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదనే అంటూ నాటి వీడియో క్లిప్పింగులను కూడా చూపించారు.


ఇక చంద్రబాబు సైతం జగన్ వెళ్ళడాన్ని పార్టీ  టెలికాన్ఫరెన్స్ లో తప్పు పట్టారని టాక్. జగన్ కేసీయార్ ట్రాప్ లో పడిపోయి ఏపీ ప్రయోజనాలు కాలరాస్తున్నారని మండిపడ్డారు. అంటే ఈ సెంటిమెంట్ తో ఇపుడు జగన్ని దొరికించేయాలని టీడీపీ డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. మరి చూడాలి ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో. 


మరింత సమాచారం తెలుసుకోండి: