- నిపుణుల కమిటీకి సూచించిన ముఖ్యమంత్రి జగన్‌
రూ.100ల పని రూ.80లకే పని జరుగుతుందంటే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లేందుకు వెనుకాడేదిలేదని, పోలవరంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో  రివర్స్‌టెండరింగ్‌కు ఎక్కడ అవకాశం ఉందో  గుర్తించాల్సిందిగా ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  నిపుణుల కమిటీకి సూచించారు. ఇరిగేషన్ నిపుణులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. 


 ప్రభుత్వ పారదర్శకత దేశానికి ఆదర్శం కావాలని, అందుకోసమే జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటును కోరినట్టు సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. పోలవరంలో అనేక అవకతవకలను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రస్తావించారు. పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి సూచించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందని, స్పిల్‌వే పనులు పూర్తిచేయకుండానే కాఫర్‌ డ్యాంకు వెళ్లారని విమర్శించారు.

ఫలితంగా గోదావరిలో వెడల్పు తగ్గిందని, భారీగా వరద వస్తే 4 నెలలపాటు పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని సహించేదిలేదని , ఎవరైనా ఆ దిశగా ఆలోచిస్తే ఉపేక్షించేదిలేదని ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరోక్షంగా హెచ్చరించారు.  ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదన్నారు.  టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించి, త్వరితగతిన ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: