చంద్రబాబును ప్రజలు ఘోరంగా ఓడించిన బాబుగారికి ఇంకా తన అహం పోలేదని చెప్పాలి. పదేళ్ళు ప్రతిపక్షంలో వున్నాక, చంద్రబాబులో మార్పు వచ్చిందని చాలామంది అనుకున్నారు. మళ్ళీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా అవకాశమొచ్చేసరికి.. జూలు విదిలించేశారు. ఫలితం, మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం. రాజకీయాల్లో గెలుపోటములు మామూలే అయినా, గెలుపు అనేది బాద్యతను పెంచాలి.. ఓటమి అనేది పాఠాల్ని నేర్పాలి. చంద్రబాబుకి మాత్రం గెలుపు అనేది అహంకారాన్ని పెంచడానికీ, ఓటమి అనేది బుకాయించడానికి మాత్రమే పనికొస్తుంది.


అయితే ఇప్పుడు చంద్రబాబు తన నివాసం పక్కనే నిర్మించుకున్న ప్రజావేదిక వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది నిజానికి ప్రభుత్వ ఆస్తి. దాన్ని తమకే ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాయడమే అర్థం పర్థంలేని వ్యవహారం. ఆ మాటకొస్తే, చంద్రబాబు నివాసముంటోన్న భవనమే అక్రమకట్టడం. దానికి సంబంధించి వివాదం నడుస్తోంది. అధికారం అప్పట్లో తనచేతిలో వుంది గనుక సరిపోయింది చంద్రబాబుకి. అధికారం పోయాక, వెంటనే ఆ భవనం ఖాళీ చేసేసి వుండాలి. ఇంకా అడ్డగోలు వాదనలే చేస్తున్నారక్కడ.


ఉండవల్లి ప్రజావేదిక నుంచి, టీడీపీకి చెందిన కొన్ని వస్తువుల్ని ప్రభుత్వం ఖాళీ చేయించింది.. అక్కడ కలెక్టర్ల సమావేశం జరగబోతోంది. దానిపై మళ్ళీ యాగీ షురూ చేసింది తెలుగుదేశం పార్టీ. 'చంద్రబాబుపై కుట్ర జరుగుతోంది.. ఆయన భద్రత మీద మాకు అనుమానాలు పెరుగుతున్నాయి..' అంటూ తెలుగు తమ్ముళ్ళు చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. రాజధాని అమరావతి పరిధిలో అత్యంత ఖరీదైన భవనం కట్టుకునే అవకాశం గత ఐదేళ్ళలో చంద్రబాబుకి కలగకపోవడం శోచనీయమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: