భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఆంధ్రాకు మరోసారి తీవ్ర నష్టం జరగబోతోందా... ? ఈ ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు అవుననే సమాదానం చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విభజితమైన అనంతరం, అప్పటి వరకూ తరాలుగా కూడబెట్టిన స్థిరాస్తులను ఆంధ్రా నష్టపోయింది. అవన్నీ తెలంగాణ వసమయ్యాయి. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ ఫలితాన్ని అనుభవిస్తోంది. 2014 ఎన్నికల నుంచి వరుసగా ఆ పార్టీ ఓటమిని చవిచూడక తప్పటంలేదు. 


రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నాయకులు ఆంధ్రాకు ప్రత్యేక హోదా 15 ఏళ్ల పాటు ఉండేలా ఇవ్వాలని అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీని డిమాండ్‌ చేశాయి. అదే డిమాండ్‌తో అధికారంలోనికి వచ్చిన బీజేపీ ఆంధ్రాకు స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వటం సాధ్యం కాదని ఘంటాపధంగా తెగేసి చెప్పేసింది. 2014, 2019 ఎన్నికల్లో వరసగా అధికారంలోనికి వచ్చిన బీజేపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు.


తాజాగా 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి 175 అసెంబ్లీ స్థానాలకు 151 సీట్లు గెలిచి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. 23 స్థానాలతో తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని సంపాదించుకుంది. జనసేన పార్టీ ఒక్క స్థానాన్ని చేజిక్కించుకోగా బీజేపీ ఈ సారి ఆ మాత్రం కూడా బోనీకాలేదు. ఆ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అడ్డదారుల్లోనైనా పాగా వేయాలని ఆ పార్టీ సంకల్పంగా పెట్టుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. 


మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో బీజేపీ ప్రతిపక్షంపై కన్నేయటం చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యలను బీజీపీలోనికి విలీనం చేసుకున్న ఆ పార్టీ  తాజాగా శాసన సభ సభ్యులను కూడా తమ పార్టీలోనికి కలుపుకునేందుకు పావులు కదుపుతోంది. అందుకు ఒక్కొక్కరికి భారీగానే ముడుపులు చెల్లిస్తున్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోనికి వెల్లిపోవటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ నాయకులు చెప్పటం విశేషం.

బీజేపీ ఆసించినట్టుగా 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసన సభలో ప్రతిపక్షమనేదే లేకపోతే రాష్ట్రంలో తలెత్తే సమస్యలపై చర్చ అనేదానికి అవకాశం ఉండదని అభిప్రాయపడుతున్నారు. దాని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా తాజాగా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోందని చెబుతున్నారు. ఆ విధంగా మరోసారి రాష్ట్రానికి నష్టం కల్పించేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: