విశాఖ శారదాపీఠాధిప‌తి శంకరాచార్య శ్రీ స్వరూపానందేంద్రసరస్వతి స్వామి హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. జలవిహార్‌లో నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మంలో స్వ‌రూపానందేంద్ర‌తో పాటుగా శ్రీస్వాత్మానందేంద్రసరస్వతిస్వామిజీల కు పుష్పాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై స్వహస్తాలతో పుష్పాభిషేక మహోత్సవాన్ని జరిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి  మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల నుంచి బ్రాహ్మణులు తరలివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 


ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములకు కేసీఆర్ నూతన వస్త్రాలను సమర్పించి, పుష్పమాలతో సత్కరించారు. తెలంగాణ హరితహారానికి ప్రతీకగా తులసిమాలలను కేసీఆర్ సమర్పించారు.  సీఎం కేసీఆర్.. హైదరాబాద్ కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల స్థలం పత్రాలను స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు. ఈ సంద‌ర్భంగా స్వరూపానందేంద్ర స్వామి  మాట్లాడుతూ ‘‘సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరం. విశాఖ పీఠానికి హైదరాబాద్‌లో స్థలం కేటాయించడం చాలా గొప్ప విషయం.’’ అని అన్నారు. స్వరూపానందేంద్ర స్వామి ఆదేశాల మేరకు దేశం నలమూలలా పర్యటించి శంకర అద్వైతాన్ని ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా స్వాత్మానందేంద్రస్వామి అన్నారు. ధర్మ ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

కాగా, విశాఖ శారదాపీఠం బావిబాధ్యతలను ఇరవై ఆరేళ్ల‌ బ్రహ్మచారి కిరణ్‌కుమారశర్మ (బాలస్వామి)కి శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీమహాస్వామి అప్పగించిన సంగ‌తి తెలిసిందే. కుమారశర్మకు శిష్యతురీయాశ్రమ దీక్షను స్వయంగా ప్రదానం చేశారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న పేరును స్వాత్మానందేంద్ర స్వామిగా ప్ర‌క‌టించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో వేదవేద్యులు, ఆధ్యాత్మిక, రాజనీతి, కళారంగాల ప్రముఖుల సమక్షంలో బాలస్వామి సన్యాసాశ్రమ స్వీకరణ ఘనంగా నిర్వహించారు. బెజవాడ దుర్గమ్మ పాదాలవద్ద కృష్ణానదీతీరాన నెలకొన్న గణపతిసచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గాతీర్థం వేదికగా జరిగే కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి భక్తకోటి తరలి వ‌చ్చింది. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. 


కుమారశర్మ స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం. 1993 ఏప్రిల్ 4న విశాఖలో జన్మించారు. పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ దంపతుల ఇద్దరు పిల్లల్లో పెద్దవాడు. మూడోతరగతి చదువుతుండగా తల్లిదండ్రులతో కలిసి స్వరూపానందేంద్రను దర్శించే భాగ్యం కలిగింది. బాలకిరణుడు.. మహాస్వామి కంటికి అపరశంకరునిగా గోచరించారు. వెంటనే పిల్లవాడ్ని పీఠానికి చేర్చమని తల్లిదండ్రులకు సూచించారు. నాటినుంచి కుమారశర్మ జీవితం మారిపోయింది. మహాస్వామి ప్రధాన శిష్యుడయ్యారు. ఆయన బాటలో ధర్మపరిరక్షణకు కృషిచేస్తానని కుమారశర్మ చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: