తెలుగు రాష్ట్రాల మ‌ధ్య స‌త్సంబంధాలు ఏర్ప‌డ‌ట‌మే లక్ష్యంగా సాగుతున్న ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మ‌రో కీల‌క‌మైన అడుగు వేయ‌నున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై భేటీ కానున్నారు. ప్రగతిభవన్ వేదికగా రెండు రోజులపాటు జరుగనున్న ఈ భేటీలో విభజన సమస్యలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఆరు అంశాలతో ఏపీ ఎజెండా ఉండ‌నుంది. ఏపీనుంచి 27మంది సభ్యుల బృందం పాల్గొన‌నున్నారు. 


విభజన సమస్యల పరిష్కారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఆరు అంశాల ఎజెండాతో గవర్నర్‌ద్వారా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దీంతో సీఎం కేసీఆర్ అడుగు ముందుకేసి హైదరాబాద్ ప్రగతిభవన్‌లోనే రెండురోజులపాటు సమావేశమై కూలంకషంగా చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు ఏపీ సీఎం అంగీకరించారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు కూడా హాజరుకానున్నారు. జగన్ ప్రతిపాదించిన ఎజెండాలో సాగునీటిపారుదలతోపాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూలు సంస్థలు, ఢిల్లీలోని ఏపీభవన్ విభజన, విద్యుత్ సమ స్య, వంటివి ఉన్నాయి. వీటితోపాటు సివిల్ సైప్లెస్ కార్పొరేషన్‌లో రూ.1,775 కోట్లు ఏపీకి వస్తాయని, వాటిని ఇప్పించాలని పేర్కొన్నారు. జగన్ ప్రతిపాదించిన ఈ అంశాలపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇటీవల వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఏవిధంగా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చునో ముసాయిదా రూపొందించి సీఎం కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. ఇద్దరు సీఎంల సమావేశం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా గోదావరి నీటి వినియోగంపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. 


చర్చల ఎజెండా భాగంగా, న‌దీజలాల విభజన.. గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడం, 9&10 షెడ్యూల్‌లోని సంస్థల విభజన, విద్యుత్ సంబంధిత అంశాలు, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, సివిల్ సైప్లెస్ కార్పొరేషన్‌కు రూ.1775 కోట్ల బకాయిలు, ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రానికి బదిలీచేయడం అనే అంశాలు ప్ర‌ధానంగా ఉండ‌నున్నాయి. ఈ సమావేశానికి కొనసాగింపుగా జూలై మూడున రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ సీఎస్‌లు గవర్నర్ సమక్షంలో భేటీ అయి సీఎంల సమావేశంలో అంగీకారానికి వచ్చిన అంశాలపై తుదిరూపమిస్తారు. ఆ మేరకు గవర్నర్ ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. 


చర్చల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ గురువారం సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సీఎంల భేటీలో జగన్ వెంట ఏపీ మంత్రులు, సీఎస్, పలుశాఖల ముఖ్యకార్యదర్శులు, ఉన్నతాధికారులు మొత్తం 27 మంది సభ్యుల బృందం పాల్గొననుంది. సాధారణ ఎన్నికల తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇద్దరు సీఎంలు సమావేశమవడం, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం రావడం జరిగింది. ఈ క్రమంలోనే సీఎంల తాజా భేటీ రెండు రాష్ర్టాల మధ్య కీలక సమస్యలకు పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: