ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు, తెన్నులు చూస్తుంటే ఎవరికైనా ఇలానే (రెచ్చిపోదాం బ్రదర్) అనిపిస్తుంది.  పదవి చేపట్టగానే తన ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రతిరోజూ చేసే మార్పులు చేర్పులు, అలాగే కఠినంగా అమలు చేస్తున్న కూల్చివేతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. చిన్నపిల్లాడికి కొత్త బొమ్మనిస్తే ఎలాంటి ఉత్సాహం వుంటుందో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు ముఖ్యమంత్రిగారు.  కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన కట్టడాన్ని క్షణాల్లో కూల్చేశారు.  ఓ పక్క పైసాలేదు మొర్రో అంటూ కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లుతూ మరో పక్క మన భవనాలు మనమే కూల్చుకుంటూ పోతే లెక్క సరిపోతుందా సీయంగారూ ఒక్కసారి ఆలోచించండి. 

 

ప్రస్తుత రాష్ట్ర ముఖ్య సమస్యల్లో అడ్డుగా వున్నవి అక్రమ కట్టడాలే అన్నది మీ వాదన.  ఈ అక్రమ కట్టడాలను తొలగిస్తే వచ్చే ఆదాయం ఎంత, తోలగిస్తే వచ్చే నష్టం ఎంత ? అసలు ఇన్నాళ్ళు అడ్డు లేనివి ఆయన పదవిలోకి రాగానే అంత పెద్ద అడ్డు ఎలా అయ్యాయి. ప్రతిపక్షం లో వున్నపుడు కనీసం ప్రజావేదిక గురించి నోరైనా మెదపని జగన్ ఈ రోజు గునపం దించి మరీ ధ్వంసం ఎందుకు చేయాల్సివచ్చింది.  ఇవన్నీ బేరీజు వేసుకుని బరిలోకి అయితే దిగలేదు జగన్ గారు. ఎందుకంటే వీరి చర్యలన్నీ ప్రజాపాలనా పరమైన నిర్ణయాలు కాదన్నది నిర్వివాదాంశం.  ప్రస్తుతం సాధారణ సామాన్యుడికి కూడా ఈ సందేహం లేకపోలేదు.

 ముందుగా రాష్ట్ర సమస్యలు అనేకం అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది లోటు బడ్జెట్, ప్రత్యేక హోదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.  ఈ మధ్య జరిగిన ఐపిఎస్ ఆఫీసర్ల విందులో “అన్నా నాకు ఈ పదవి కొత్త మీరందరూ దగ్గరుండి నన్ను నడిపించాలి” అన్న జగన్ గారు నేడు పల్లవి మార్చి ‘రెచ్చిపోదాం బ్రదర్’ అని తనతో పాటు తమ మందీమార్బలాన్ని ఉరకలెత్తిస్తున్నారు.  ఈ అత్యుత్సాహం, ఆవేశాన్ని అత్యవసర సమస్యలపై  పెడితే రాష్ట్రం గాడిన పడుతుంది.  ప్రజలు కూడా ‘రెచ్చిపోదాం బ్రదర్’ అని మీతో గళం కలుపుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: