ఇప్పటిదాకా ఉప్పునిప్పుగా ఉన్న ఏపీతెలంగాణ సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు వేసిన ముందడుగు ఆశావహ పరిణామాలకు తావిస్తోంది. ఇప్పటివరకూ రాజకీయంగా వైరం ఉన్న రెండు రాష్ట్రాలు.. ఇప్పుడు ఏపీకి జగన్ సీఎంగా రావడంతో ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయనకున్న వ్యక్తిగత సంబంధాలు, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యల పరిష్కారానికి ఆ సత్సంబంధాలు దోహదపడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరిగింది. సీఎం జగన్‌తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్ చర్చల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు అజేయ కల్లం, సజ్జల రామక ష్ణారెడ్డి, ప్రేమ్‌చంద్రారెడ్డి, ఆదిత్యనాథ్‌దాస్, ఎస్‌ఎస్ రావత్ సమావేశంలో పాల్గొన్నారు.


   తెలంగాణ తరపున కేసీఆర్‌తో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, ఎస్ నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఎంపీ కె కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకరరావు, సలహాదారుడు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక ష్ణరావు, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్ చర్చలకు హాజరయ్యారు.
         ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీకు కేటాయించిన భవనాలకు సంబంధించిన వివాదం పరిష్క తమైన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన ఏపీ సచివాలయ, అసెంబ్లీ, ఇతర భవనాలను తెలంగాణ స్వాధీనం చేసుకుంది.


     ప్రధానంగా.. విద్యుత్ బకాయిల అంశంలో ఎవరు తగ్గుతారు? ఎవరు నెగ్గుతారన్న దానికంటే.. అసలు ఆ బకాయిలు వచ్చే పరిస్థితి ఉందా? లేదా ? దానిని జగన్ తెలంగాణ నుంచి సాధిస్తారా? లేదా అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అయితే.. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం తగ్గితేనే అనేక సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు చాలాకాలం నుంచి చెబుతున్నారు. అదేవిధంగా ఉద్యోగుల స్థానికత వ్యవహారం పీటముడికి తెరదించాలన్న ఆశ కనిపిస్తోంది. ఇద్దరు సీఎంలు రెండు రాష్ట్రాల సమస్యకు చొరవ తీసుకున్న నేపథ్యంలో కొన్ని కీలక సమస్యలపై చిరకాల ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.


  నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 53.89%, ఏపీకు 46.11% విద్యుత్ వాటాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడేళ్ల వరకు రెండు రాష్ట్రాలమధ్య విద్యుత్ వాటాల పంపకాలు జరిగాయి. పరస్పరం జరిగిన విద్యుత్ పంపకాలకు సంబంధించిన బిల్లులను ఇరు రాష్ట్రాలు ఒకరికి ఒకరు చెల్లించుకోవాల్సి ఉంది.
    ఇతర ఆర్థికపర వివాదాలు కలిపితే తెలంగాణ నుంచి రూ.5,200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాదించింది. ఈ బకాయిలను చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు దివాళ తీసినట్లు ప్రకటించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం జాతీయ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ)లో కేసు సైతం వేసింది.


 అయితే, రెండు రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన వ్యవహారాలన్నింటినీ పరిష్కరించుకున్న తర్వాత తమకే ఏపీ నుంచి బకాయిలు రావాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదాల స్థితిగతులపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఎస్‌కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యంలు వచ్చే నెల 3న రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో సమావేశమయ్యే సందర్భంగా దీనిపై చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 


గోదావరి, కష్ణా జలాల పంపకాలు, మిగులు జలాల సంపూర్ణ వినియోగంపైనా పూర్తి స్థాయి స్పష్టత రావలసి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై శుక్రవారం జరిగిన భేటీలో సూత్రప్రాయ నిర్ణయం జరిగినప్పటికీ, ఇంకా స్పష్టత రావలసి ఉందంటున్నారు. 
అదే సమయంలో ఏపీ తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకోవలసి ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో పనిచేస్తున్న 1,152 మంది ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు ఇక్కడి విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేయడంతో దాదాపు ఐదేళ్ల కింద ప్రారంభమైన వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ డీఎం ధర్మాధికారి పరిశీలనలో ఉంది. రిలీవైన ఉద్యోగుల్లో దాదాపు 583 మంది ఏపీకి వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వగా, మిగిలిన వారు తెలంగాణకు ఇచ్చారు. 


ఈ కేసులో తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులకే రాష్ట్ర‌ ప్రభుత్వం ఐదేళ్లలో దాదాపు రూ.240 కోట్ల వరకు ఫీజులు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం సైతం దాదాపు ఇదే మొత్తంలో ఖర్చు చేసి ఉండొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్డ్ 9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన తదితర అపరిష్కత అంశాలను కూడా ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. ఇక‌పోతే గ‌త ఏపీ ప్ర‌భుత్వంతో పోలిస్తే ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలోని ఇరు రాష్ట్రాల సీఎంలు కొన్ని స‌మ‌స్య‌ల‌ను క‌లిసి ప‌రిష్క‌రించేందుకుగాను ముందుకు వెళుతున్నారు. మ‌రి ఈ ప‌రిష్కారాలు ఏ విధంగా ప‌రిష్క‌రిస్తారో వేచి చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: