సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు చిరునామా అయిన యూపీలో మ‌రోమారు అదే త‌ర‌హ నిర్ణ‌యం వెలువ‌డింది. త‌న‌దైన శైలిలో నిర్ణ‌యాలు, వివాదాలు, ప‌రిపాల‌న‌తో ముందుకు సాగుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తాజాగా మ‌రో ఆదేశం వెలువ‌రించారు. ప్రభుత్వోద్యోగులు ఉదయం 9 గంటల కల్లా ఆఫీసులకు రావాలని యోగి సార‌థ్యంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు, ఎస్పీ లు సహా ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదయం 9 గంటల కల్లా కార్యాలయాలకు చేరుకోవాలి. లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి జీతంలో కోత కూడా విధిస్తాం అని సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


కలెక్టర్లు, ఎస్పీలు సామాన్యులకందుబాటులో ఉండటం లేదని పలు ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోది. తమ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. అవినీతిపరులైన పోలీ సు అధికారులు, సరిగా విధులు నిర్వర్తించని పోలీసుల జాబితాను ఈ నెల 30లోపు పం పాలని అడిషనల్ డీజీపీ పీయూష్ ఆనంద్ అన్ని పోలీస్‌స్టేషన్లకు లేఖలు పంపారు. ఇదిలాఉండ‌గా,  ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆఫీసు కొచ్చే సమయాన్ని నిర్ణయించిన సీఎం.. ఇంటికెళ్లే టైం నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ ఎస్పీ మాట్లాడుతూ ``మేం కూడా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలనుకుంటాం. అనుకోకుండా నా జిల్లా పరిధిలో ఓ పెద్ద రోడ్డు ప్రమాదం సంభవిస్తే తెల్లవారుజామున 4 గంటల వరకు నేను అక్కడే ఉండి.. మళ్లీ ఉదయం 9 గంటలకల్లా ఆఫీసుకు ఎలా రాగలుగుతాను? అయినా మేం 24 గంటలూ డ్యూటీలోనే ఉంటాం`` అని తెలిపారు. మరో అధికారి ఒకరు స్పందిస్తూ పెండింగ్ ఫైళ్లు లేనప్పుడు ఉదయం 9 గంటలకల్లా వచ్చి ఖాళీగా కూర్చోవడం సరికాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: