ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త‌ల‌పెట్టిన కీల‌క కార్య‌క్ర‌మంలో మార్పులు చోటుచేసుకున్నాయి. జూలై 1వ తేదీ నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించ‌నున్న ప్రజాదర్బార్‌ కార్యక్రమం వాయిదా ప‌డింది. అసెంబ్లీ సమావేశాలు, ఏర్పాట్లు పూర్తికానందున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి  చేపట్టిదలచిన ప్రజాదర్బార్‌ వాయిదా వేయడమైందని ప్ర‌భుత్వం త‌ర‌ఫున స‌మాచారం వెల్ల‌డైంది. త్వ‌ర‌లో త‌దుప‌రి తేదీలు ఖ‌రారు కానున్నాయి. 

 

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించేవారు. ఆయన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకూ అదే బాటను అనుసరించే యత్నం చేసినప్పటికీ కొద్దికాలం త‌ర్వాత అది వాయిదా ప‌డింది. అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి బాటలో పయనిస్తూ ప్రజలను ప్రతిరోజూ ఒక గంట పాటు కలుసుకోవాలని నిర్ణయించారు.సీఎం పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి జగన్‌ తరచుగా సామాన్య ప్రజలను కలుస్తూనే ఉన్నారు. అయితే, ఒక క్రమపద్ధతిలో ఈ కలయికలు జరుగలేదు.అందువల్ల తానే స్వయంగా ప్రజానీకాన్ని కలుసుకునేందుకు వీలుగా జూలై 1 నుంచి ప్రజాదర్బార్‌ను తలపెట్టారు. అయితే, తాజాగా అది వాయిదా ప‌డింది.  బడ్జెట్ సమావేశాల తరువాత ప్రజాదర్బార్‌ను నిర్వహించే అవకాశం ఉందని స‌మాచారం.

 

కాగా, ఇప్ప‌టికే అధికారులు ప్ర‌జాద‌ర్బార్‌కు ఏర్పాట్లు చేశారు. క్యాంపు కార్యాలయం వద్ద ప్రజా దర్బార్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సీఎం వద్దకు వినతిపత్రాలతో వచ్చే ప్రజలు వేచి చూసేందుకు వీలుగా క్యాంపు కార్యాలయానికి సమీపంలో షెడ్డు నిర్మించి ఫ్యాన్లు ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. సీఎం నివాస పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేసి ఇంటి ముందున్న చిన్న చిన్న నిర్మాణాలను పరిహారం చెల్లించి తొలగించారు. పోలీసు అధికారులు సిబ్బందిని పెంచి వినతులతో వచ్చేవారిని క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.  జూలై 1నుంచి ప్రతి రోజూ ఉదయం 8-9మధ్యలో గంటపాటు ప్రజల వినతులు ప్రత్యక్షంగా వినేందుకు జగన్‌ సిద్ధమయ్యారు. కానీ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వాయిదా వేయాల్సి వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: