చంద్రబాబు అయిదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉంటూ జగన్ సర్కార్ ని జనంలో ఎండగడుతూ మళ్ళీ అధికారం కోసం బాటలు వేసుకోవాలనుకుంటున్నారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఆయన్ని రెచ్చగొడుతున్నారు. అలా ఇలా కాదు, బాబు పని అయిపోయింది. ఇక ఆయన జనంలో ముఖ్యమంత్రి కాలేరని అంటున్నారు.



బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనేక అవినీతి అక్రమాలు జరిగాయని వైసీపీ, బీజేపీ కూడా గట్టిగానే ప్రచారం చేశాయి. బీజేపీ ఎంపీ జీవీఎల్ అయితే బాబు అవినీతికి హద్దే లేదని చాలా సార్లు అన్నారు. బాబు దిగిపోగానే విచారణ జరిపించి అంతా బయటకు కక్కిస్తామని కూడా అన్నారు. ఇక మరో వైపు వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడా బాబు అండ్ కో చేసిన అవినీతి లక్షల కోట్ల పై మాటేనని కూడా అన్న్నారు. ఇక ఏపీ బీజేపీ ఇంచార్జు సునీల్ డియోధర్ చంద్రబాబు జైలుకు వెళ్ళడం ఖాయమని ప్రకటించారు. ఆయన ఇంతకు ముందు కూడా రెండేళ్ల జైలు శిక్ష బాబుకు వేశారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఇంక జైల్లోనే బాబు అనేశారు. 


అంటే చంద్రబాబు పై కేంద్రం సీబీఐ లాంటి సంస్థలతో విచారణ జరిపించి కటకటల వెనక్కు నెట్టే వ్యూహంలో ఉందా అనిపిస్తోంది. ఏపీలో జగన్ కూడా గత సర్కార్ అవినీతి మీద విచారణ కమిటీలు వేస్తున్నారు. ఇక అమరావతి భూముల ఎపిసోడ్ చాలా పెద్దదే. అక్కడ ఇన్శైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. పోలవరం గోడలు ముట్టుకుంటే అవినీతి కంపు అంటున్నారు. ఇవి కాక ఐటీ భూముల 
ఒప్పందాలు, పంచాయతీ రాజ్ నిధుల దారి మళ్ళింపు, నీరు చెట్టు భాగోతాలు ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి వీటిని ఆధారంగా చేసుకుని విచారణ జరిపిస్తారా అన్నది చర్చగా ఉంది.


ఇక చంద్రబాబుకు జీవితంలో మళ్ళీ సీఎం కాలేరని సునీల్ డియోధర్ జాతకం చెప్పేశారు. బాబుకు రాజయోగం ముగిసి జైలు యోగం ప్రాప్తించిందని  అయన అంటున్నారు. చంద్రబాబు పార్టీ కూడా ఇక  ఏపీలో గల్లంతేని కూడా చెప్పేశారు. మొత్తానికి ఈ బీజేపీ ఇంచార్జి సామాన్యుడిలా లేరు. ఏపీకి వచ్చినపుడల్లా బాబునే టార్గెట్ చేస్తున్నారంటే వెనకాతల స్క్రిప్ట్ అంతా రెడీగా ఉందేమోనని తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: