విభజన సమస్యలన్నీ పరిష్కరించుకోవాలనే దృఢ నిర్ణయంతో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే, జూన్ 28న ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో నీటిపారుదల అంశంతోపాటు అన్ని సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో ఇద్దరు సీఎంలు ఒక భూమికను సిద్ధంచేశారు. ఈ క్ర‌మంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రెండు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగాల్సి ఉన్నది. అయితే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తిమేరకు బుధవారంనాటి సమావేశాన్ని వాయిదావేశారు. తదుపరి సమావేశం తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నారు.


ఇద్ద‌రు ముఖ్య‌మంత్రి భేటీ అనంత‌రం మరుసటిరోజు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సమావేశమై, విభజన అంశాలపై చర్చించి, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014కు అనుగుణంగా పలు ప్రతిపాదనలు రూపొందించారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10 సంస్థలపై చర్చించారు. షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థల్లో 44 సంస్థల విభజనలో ఎలాంటి సమస్యలు లేవు. ఆరు సంస్థల ప్రధాన కార్యాలయాలు ఏపీలోనే ఉన్నాయి. వాటిపై తెలంగాణ ఎలాంటి వివాదాన్ని లేవనెత్తలేదు. మూడు సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం జీవోలు ఇచ్చుకుంది. ముఖ్యంగా దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్), హౌసింగ్‌బోర్డు, విద్యుత్ సంస్థలు, ఆర్టీసీ, ఏపీ డెయిరీ లాంటి కీలకమైన సంస్థలు సహా 38 సంస్థల విభజనపై విభేదాలున్నాయి. హెడ్‌క్వార్టర్ అంటే ఆయా సంస్థల సీఎండీలుగానీ, ఎండీలుగానీ కూర్చునే కార్యాలయాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. 
ఇదే విషయాన్ని గతంలో కేంద్రం కూడా అనేక పర్యాయాలు స్పష్టంచేసింది. కానీ చంద్రబాబు నాయకత్వంలోని నాటి ఏపీ ప్రభుత్వం ఆయా సంస్థలకు హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఉన్న భూములపై కన్నేసింది. ఈ భూముల్లో వాటా కావాలని వితండవాదానికి దిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అభ్యంతరం వ్యక్తంచేసింది. దిల్‌కు ఉమ్మడి ప్రభుత్వంలో సుమారు 4900 ఎకరాల భూములను హైదరాబాద్ నగరంలో కేటాయించారు. ఈ భూములను విక్రయించి రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆనాటి ఉమ్మడి సర్కారు నిర్ణయించింది. అయితే భూముల విక్రయం జరుగకుండా నాటి తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకోవడంతో అమ్మకాలు నిలిచిపోయాయి. భూములు మిగిలాయి. విభజన తర్వాత ఏపీలో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఆ భూముల్లో వాటా కావాలని వాదించింది. దీంతో దిల్ విభజన ఆగిపోయింది. అలాగే ఏపీ డెయిరీ, ఆర్టీసీ, హౌసింగ్‌బోర్డు, విద్యుత్‌సంస్థలతోపాటు పలు సంస్థల విభజన పూర్తికాలేదు. ఇదే తీరుగా షెడ్యూల్ 10 సంస్థలపై కూడా ఏపీ పేచీపెట్టింది. వాస్తంగా విభజన చట్టంలో పదో షెడ్యూల్ సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి. కానీ ఉన్నత విద్యామండలిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇలా నాటి ఏపీ ప్రభుత్వం వివాదాలు లేవనెత్తి షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనను అడ్డుకున్నది.


అయితే, మారిన రాజకీయ పరిస్థితుల్లో రెండు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విభజన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కోరిన వెంటనే హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న భవనాలన్నింటినీ ఏపీ ప్రభుత్వం అప్పగించింది. ఏపీ ప్రభుత్వం భవనాలను అప్పగించడానికి ముందుకురాగానే ఆ భవనాలకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం రద్దుచేసింది. ఆ తర్వాత అధికారికంగా ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా గవర్నర్ సమక్షంలో ఇద్దరు సీఎస్‌లు భేటీ కావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత చాలాసంస్థల పూర్తిస్థాయి విభజనకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ స‌మావేశం ప్ర‌స్తుతానికి వాయిదా ప‌డింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: