చంద్రన్నా, మీ దత్తత గ్రామం గుర్తుందా..? 

'' ఆకు పచ్చని అరకు కొండలమధ్య విసిరేసినట్టున్న గ్రామాన్ని నేను. ఇక్కడంతా, కాయకష్టం చేసుకొని బతికే వారే, పని దొరికితే తింటారు, లేకుంటే పస్తులే. విద్య,వైద్య సౌకర్యాలు లేవు. ఇలా బతుకుతున్న గ్రామాన్ని, దయతో 2015 అక్టోబర్‌లో మీరు దత్తత తీసుకున్నారు. ఏ లోటు రాకుండా చూసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారే దత్తత తీసుకున్నాక మా దశ తిరుగుతుందని, పేపర్లన్నీ రాశాయి. కాబోలు అనుకొని సంతోషించాం.

అపుడపుడు మీ అధికారులు వచ్చి హడావడి చేయడమే తప్ప మా గురించి పట్టించుకోలేదు. మీరేనాడు ఒరిగి పోతున్న మా ఇళ్లకు వచ్చి మమ్మల్ని పలకరించ లేదు. అరకు పక్కనే ఆరు కిలో మీటర్లు దూరంలో ఉన్న మా గ్రామంలో పదకొండు వేల జనాభా ఉన్నప్పటికీ, ఒక్క ప్రాధమిక ఆరోగ్యకేంద్రం కూడా లేదు.

తాగునీటికి కేవలం కొన్ని చేతిపంపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.వాటిలో కొన్ని రిపేరులో ఉన్నాయి. గరడగుడ,గంజాయిగుడ గ్రామాల్లో కొండలమీదున్న ఊటనీటి కుంటలనుండి దిగువకు ప్రవహించే నీరే మాకు ఆధారం. మా గ్రామంలో అడుగు పెడితే ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తుంది. మురుగు నీటి పారుదల వ్యవస్ధలేదు. చినుకు పడితే చిత్తడే. వీధుల్లో నీరు నిలిచి పోతుంది. దీంతో దోమలు పెరిగి రోగాల పాలవుతున్నాం.

మీరు దత్తత తీసుకున్నారనే భయంతో మొక్కుబడిగా సీసీ రోడ్లు వేశారు కానీ, వాటి పక్కన మురురునీరు పోయే ఏర్పాట్లు చేయక పోవడం వల్ల వానలు కురిసినపుడు నీరంతా రోడ్లుమీదకు చేరుతోంది. ఐదేళ్ల క్రితం మేం ఎలా ఉన్నామో ఇపుడూ అలాగే ఉన్నాం..

ఇటీవల మీ సొంతూరు కుప్పం వెళ్లి అక్కడి జనానికి ధైర్యం చెప్పారని టీవీల్లో చూశాం. మరి మీ దత్తత గ్రామం ఏం పాపం చేసుకుంది ..?

ఇపుడు మీరు సీఎం సీటులో లేక పోవచ్చు , కానీ, బాధ్యత కలిగిన ప్రతిపక్షనాయకుడిగా మీ దత్తత గ్రామం అభివృద్ధి గురించి పాలక పక్షంతో పోరాడి మా సమస్యలు తీరుస్తారని ఎదురు చూస్తున్నాం... బాబు గారూ... ?

ఇట్లు, మీ దత్తత గ్రామం,

పెదలబుడు పంచాయితీ,

అరకు వ్యాలీ, విశాఖ జిల్లా. 

మరింత సమాచారం తెలుసుకోండి: