కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశ పూర్వక ఎగవేతదార్లపై ఉక్కుపాదం మోపిందని.ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ముఖ్యంగా లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ పేరుతో కోట్లాది రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకొని ఉడాయించి పోయిన తర్వాత భారత్‌ రప్పించడానికి గట్టిగా కృషి చేస్తున్నట్లు.. అలాగే బిలియనీర్‌ నగల వ్యాపారి నీరవ్‌మోడీతో పాటు ఆయన మేనమామ మెహుల్‌ చోక్సీలు కూడా బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి తప్పించుకుపోయారని.. వారి ఆస్తులను జప్తు చేయడంతో పాటు తిరిగి మాతృదేశానికి రప్పించడానికి గట్టి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉద్దేశపూర్వక ఎగవేతదార్లకు బ్యాంకుల నుంచి లేదా ఫైనాన్షియల్‌ ఇన్సిస్టిట్యూషన్‌ల నుంచి అదనపు రుణాలను పూర్తిగా నిలిపివేయడంతో పాటు ఐదు సంవత్సరాల పాటు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వమని తేల్చిచెప్పారు.

అలాగే ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి నిధులు సేకరించడానికి వీల్లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని... దీంతో పాటు ఇన్సాల్వెన్సీ ప్రాసెస్‌ .. దివాలాచట్టం కింద ఆస్తులు వేలంలో పాల్గొనకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె సభకు వివరించారు. అలాగే ఉద్దేశ పూర్వక ఎగవేతదార్లు దేశం నుంచి పారిపోకుండా ఉండేందుకు లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేయడానికి బ్యాంకు చీఫ్‌లకు అధికారం ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదార్లపై గత 3 ఆర్థిక సంవత్సరాల నుంచి సుమారు 1,475 పోలీసుస్టేష న్‌లలో ఫిర్యాదులు చేశాయని ఆర్థికమంత్రి సభకు వివరించారు.

బ్యాంకు మోసాలు గత ఆర్థిక సంవత్సరం 2018-19లో గణనీయంగా దిగివచ్చాయి. రూ.1 లక్ష అంత కంటే ఎక్కువ మొత్తం మోసాలు 6,735కు దిగిరాగా.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 9,866 గా ఉన్నాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం నాడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6,738 మోసం కేసుల్లో రూ.2.836 కోట్ల వరకు మోసాలు జరిగితే.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 9,866 మోసాల కేసుకు సంబంధించి రూ.4,228 కోట్ల వరకు జరిగాయని ఆమె తెలిపారు. మోసా లకు గల కారణాల గురించి ఆమె సమాధానమిస్తూ.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో క్రమశిక్షణ లేకపోవడంతో పాటు రుణాలు ఇష్టానుసారం ఇవ్వడం కూడా ఒక కారణంగా చెప్పారు.

డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రాత్రికి రాత్రి ఎగనామం పెట్టే కంపెనీలకు రుణాలు ఇవ్వడం, కొంత మంది బ్యాంకులను తరచూ మోసం చేస్తున్నారని తెలిసి కూడా వారికి రుణాలు ఇవ్వడం. బ్యాంకుల నుంచి మోసాలు చేసి విదేశాల్లో తలదాచుకున్న వారికి రుణాలు ఇవ్వడం, వారి పాస్‌పోర్టు వివరాలు తీసుకోకుండా రుణాలు ఇవ్వడం వల్ల వారు ఎక్కడ ఉన్నారు తెలియదు.. కేసు పెడదామంటే చిరునామా ఉండదు. బ్యాంకులు క్రమశిక్షణ పాటించి రుణాలు ఇచ్చే ముందు పూర్తి స్థాయిలో ఖాతాదారుడి వివ రాలు సేకరించి రుణాలు ఇస్తే తప్ప బ్యాంకు మోసాలను నిలువరించలేమని అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: