గత ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం, అంతేకాక అప్పటికే కొన్ని సమస్యలతో అల్లాడుతున్న నూతన రాష్ట్రాన్ని మంచి అనుభవజ్ఞుడైన నాయకుడు మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరని భావించి ఎక్కువమంది ప్రజలు చంద్రబాబు ఆద్వర్యంలోని టిడిపికి పట్టం కట్టారు. అయితే అప్పటి సమయంలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుని చాలావరకు ప్రజలకు మేలు చేసిన చంద్రబాబు, రాష్ట్రానికి ఎంతో ఆవశ్యకమైన ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు నెరవేర్చడం వంటివి మాత్రం అమలుచేయలేక పోయారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో బరిలో నిలిచిన టిడిపిని ప్రజలు కేవలం అతి తక్కువ స్థానాలకె పరిమితం చేసారు. అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారాన్ని చేపట్టిన వైసిపి పార్టీ, మరియు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం పాలనను పరుగులెత్తిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక ఓవైపు వరుసగా కొందరు నేతలు టిడిపిని వీడుతుండడం ఆ పార్టీని లోలోపల కలవరపెడుతోంది. ఇక ప్రస్తుతం టిడిపి ఉన్న గడ్డు పరిస్థితులు చక్కబడి, పార్టీకి మళ్ళి పూర్వ రూపు రావాలంటే నటుడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళి రంగంలోకి దిగాలని, అయన టీడీపీ తరపున ప్రచారం చేసి, కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్తేజాన్ని నింపితే మరొక్కసారి పార్టీ ఉరకలెత్తడం ఖాయమని కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ గారి మామ శ్రీనివాసరావు సహా మరికొందరు వారి బంధువులు, ఇటీవల వైసిపిలో చేరారని, అందుకు ఎన్టీఆర్ కూడా ఆనందం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. ఇక మరోవైపు వైసిపీ గుడివాడ ఎమ్యెల్యే కొడాలి నానికి, ఎన్టీఆర్ కు ఎంతో మంచి స్నేహం ఉండడంతో అతడి ద్వారా ఎన్టీఆర్ తో మాట్లాడి కొన్నాళ్లలో అయన మద్దతును పొందాలని వైసిపి కూడా భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

అయితే ఆయన తాత సహా ఎన్టీఆర్ గారి కుటుంబ మూలాలన్ని కూడా టీడీపీలోనే ఉన్నాయని, కాబట్టి అయన ఎప్పటికైనా టిడిపికె మద్దతిస్తారు తప్ప వేరొకపార్టీకి కాదని అంటున్నారు కొందరు ఆ పార్టీ నాయకులు. అయితే ఎన్టీఆర్ తో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై చర్చించాలని కోడలి నాని రంగంలోకి దిగుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇప్పుడు ప్రచారం అవుతున్నవన్నీ కూడా ఒట్టి పుకార్లు కావడం, అందులోను వీటిపై ఎక్కడా కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఆంధ్ర రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని ప్రజలు ఈ విషయమై తెగ చర్చించుకుంటున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: