అవినీతి రహిత పాలన అందిస్తామని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా మరోవైపు ఉన్నతాధికారులే సిఎం ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయటం లేదు. కొందరు సబ్ రిజిస్ట్రాలు తాము కోరుకున్న చోట పోస్టింగులు ఇప్పించుకోవటమే ఇందుకు నిదర్శనంగా నిలిచిందట.  స్టాంప్స్ అడ్ రిజిస్ట్రేషన్స్ శాఖ లో జరుగుతున్న వ్యవహారాలే ఇందుకు తాజా ఉదాహరణలుగా చెప్పుకుంటున్నారు.  

 

ప్రభుత్వ శాఖల్లో అత్యంత అవినీతి కంపు కొడుతున్న శాఖల్లో సబ్ రిజిస్ట్రార్ విభాగం  ఒకటి. జగన్ ప్రభుత్వం రాగానే రెవిన్యు శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నియమితులయ్యారు. ఈమధ్య పిల్లి దగ్గరకు ఓ అధికారి తరపున ఒక దళారీ వచ్చి కోరుకున్న చోట సబ్ రిజిస్ట్రార్ పోస్టింగ్ ఇస్తే కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చిన అంశం సంచలనమైంది.

 

ఎప్పుడైతే ఓ దళారి తన దగ్గరకు వచ్చారో వెంటనే బాగా అవినీతికంపు కొడుతున్న ఆరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గుర్తించారు. విశాఖపట్నం, విజయవాడ చుట్టుపక్కలున్న కార్యాలయాల్లో ప్రమోషన్ల ద్వారా కాకుండా గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఎంపికైన వారినే నేరుగా నియమించాలని పిల్లి ఆదేశించారు.  అయితే పిల్లి ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదని సమాచారం.

 

తాజా బదిలీల్లో విజయవాడకు ఆనుకునుండే అత్యంత ఆదాయం కలిగిన కంచికచర్ల సబ్ రిజిస్ట్రార్ గా బాగా అవినీతి ఆరోపణలుండే ఓ అధికారి పోస్టింగ్ సాధించుకున్నారట. అలాగే విజయవాడలోని గాంధినగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఓ అధికారి కొనసాగేందుకు ఉత్తర్వులు సాధించుకున్నారట. 5 ఏళ్ళు దాటిని వారిని బదిలీ చేయమని మంత్రి చెప్పారు. అయినా సరే 8 ఏళ్ళుగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారట. చూస్తుంటే డిప్యుటి సిఎం మాటను కూడా ఎవరూ లెక్క చేయటం లేదని అర్ధమైపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: