చ‌రిత్ర సృష్టించే మెజార్టీతో, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో ఏపీ ముఖ్య‌మంత్రి పీఠాన్ని వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ గెలుపు దేశంలోని ఎంద‌రో రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆక‌ర్షించింది. ఆలోచ‌న‌లో ప‌డేసింది. ప‌దేళ్ల క‌ష్టానికి, ప్ర‌జ‌ల‌కు చేరువ అయినందుకు ఫ‌లిత‌మిద‌ని ప‌లువురు విశ్లేషించారు. అయితే, తాజాగా ఓ యువ‌ ఎంపీ జ‌గ‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం జగన్ స్పూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని మహారాష్ట్ర ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిత్యం ప్రజలతో ఉంటూ అనేక కష్టాలను ఎదుర్కొని ఏపీకి సీఎం అయిన జగన్ తనకు ఆదర్శమన్నారు. 

 

మ‌హారాష్ట్రకు చెందిన నవనీత్ కౌర్ ఆర్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. కొద్దికాలం సినిమాల్లో న‌టించి అనంత‌రం మహారాష్ట్రకు చెందిన  ఎమ్మెల్యే రవి రాణాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త రవిరాణా ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.  ఇండిపెండెంట్‌గా యాభైవేల మెజారిటీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నవనీత్ కౌర్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ తన వాయిస్ గట్టిగా వినిపించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం గురించి ప్రశ్నలను పార్లమెంట్‌లో లేవనెత్తి.. అందరి దృష్టిని ఆకర్షించారు. 

 

తాజాగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో న‌వ‌నీత్ కౌర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తనకు మహారాష్ట్ర అంటే ఇష్టమే కాని.. ఆంధ్ర అంటే ప్రాణం అని చెప్పారు. ఎందుకంటే తన కెరియర్‌ని హీరోయిన్‌గా ఆంధ్ర నుంచే ప్రారంభించానన్నారు. ``ఇప్పుడు రెండు ప్రాంతాలుగా విడిపోయింది కాని.. నవనీత్ కౌర్ ఎవరన్నదాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆంధ్రనే. తన పేరు ఎవరికీ తెలియని సందర్భంలో ఆంధ్ర జనం.. తనకు పేరుతో పాటు ఫేమ్ ఇచ్చారని అంతకు మించి మంచి స్టేటస్ ఇచ్చారు` అని నవనీత్ కౌర్ అన్నారు. తాను తెలుగు సినిమాల్లో పనిచేసి ఉండటం వల్ల.. ఎంపీగా గెలిచిన తరువాత లోక్ సభలో అడుగుపెట్టి తెలుగు వాళ్లు ఎవరున్నారు? ఆంధ్ర వాళ్లు ఎవరు ఉన్నారు అని చూసుకున్నా. ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటన్న దానిపై అవగాహన ఉంది.  తాను రాజకీయాల్లోకి వెళ్లడం.. దేశం తరుపున లోక్ సభలో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స్ఫూర్తితో తాను రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌తో అనుసంధానం అయిన వారికి ఇలాంటి విజ‌యం ద‌క్కుతుంద‌ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: